అంతవరకే!

అంతవరకే!గడిచిన జీవితం వల్ల ఉపయోగమేమీ లేదు
ఆ అనుభవం ఎందుకూ పనికిరాదు,
ఒకడిదింకొకడికే కాదు, వాడిది వాడిక్కూడా.
అదే జీవితాన్ని మళ్లీ జీవించే
అవకాశం ఎవడికి మాత్రం ఉంటుంది?

ఉద్వేగంతో ఊపేసే వయసుంటుంది
వెర్రిత్తిపోయే మనసుంటుంది
రిమోట్‌ మాత్రం సభ్య సమాజం చేతిలో ఉంటుంది

సభ్యులు రియలెస్టేట్‌ వ్యాపారులు,
నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ ఆశావహులే కాదు,
కవిగాయక వైతాళికులు కూడా.

కప్పుకున్న శాలువాలు విప్పుకుంటే
తెరుచుకునేవి, అక్షరాలో.. ఆశావహ దక్ఫథాలో కాదు;
భద్ర జీవితపు సొరుగుల్లోని
చల్లారని చెద పురుగుల సొదలే.

కొందరు చరిత్రలో నిలిచిపోతారని
మరి కొందరు సంధి ప్రేలాపనలు పేలుతూంటారు
ఏమనకు వారిని, వదిలెరు.
సెంటర్లో చిల్లరేరుకునే తాపత్రయం వారిది.

ఐసుఫ్రూటే తింటాడో, ఐన్‌స్టీన్ననే అనుకుంటాడో
ఇటొచ్చి, చిటికెన వేలితో ఈ అమతభాండాన్ని తెరిచి
వాడి గొప్పేంటో చాటింపేసుకోమను, తూలుతూ.

ఎవడి జీవితం వాడికో మహాకావ్యం
పాడుకోని, వాడి చరణం వాడ్నైనా-
చరమాంకం చేరుకునే వరకూ.

ప్రశ్నల పాడెపై పడుకోవడం
ఒక యవ్వనకాలపు జీవితేచ్ఛ-
అది వయసులో వున్నవారందరికీ కాదు,
ఇంకా వయసులోనే వున్నామనుకునే వారికే సాధ్యం.

తెర దిగిపోయిన తర్వాత వాడెవెడో
నీకూ నాకే కాదు, వాడికీ తెలీదు.
ఇక, ప్రపంచం ఊసు అవసరమా?

చితి కూడా చిటపటామంటూ
ఫెళఫెళ ఆర్భాటాలతోనే మండొచ్చు
కానీ, శవానికేం వినిపిస్తుంది- శబ్దం.
పోనీ, మనకైనా లభిస్తుందా సమాధానం?

నువ్వు ఆడుతున్నంత వరకు..
నీ శవ యాత్ర కూడా, శోభా యాత్రే!
– దేశరాజు