1. శూన్యం నిశ్శబ్దం నువ్వు ఏకమయ్యాక
జీవితం స్పృహలోకి వస్తుంది
2. బహిరంగ విద్వాంసాన్ని బహిష్కరించుకుంటూ
అల్లకల్లోలమైన అంతరంగంలో
ఎప్పుడూ మిగిలి ఉండే వెలితి మాత్రమే
బతుకు ఆకలిని తీరుస్తుందని తెలుసుకుంటావు
3. జీవితపు రోజంచున వేదనొక రాగం అవుతుంది
నీ ఏడుపు నీకు తప్ప లోకానికి వినిపించదని తెలిసిన వేళ
విచిత్రంగా కన్నీళ్లు రావడం ఆగిపోతాయి
గుర్తించబడ్డ చోటే మనిషి నిలబడగలుగుతాడు కదూ!
4. దిగులు భారం ఎంతో తెలిసి
రాత్రులకై ఎదురు చూస్తావ్
నీకై ఓ వేకువందని గుర్తు చేసే మెలకువ కోసం
పదే పదే హృదయాన్ని తడిమి చూసుకుంటావు
నిన్ను ప్రేమించినట్టే భ్రమింప చేస్తుంది జీవితం.
5. స్వప్నిస్తూ స్వప్నిస్తూ
నిద్రలోకి జారుకుంటావు
ఉలిక్కిపాటుకు కూడా వీలు లేకుండా
కుట్ర పన్ని ఉరితీస్తుంది కాలం నిన్ను
నీ నిశ్శబ్దానికి తనవైన రంగుల అద్దుకుంటుంది ఈ ప్రపంచం.
– పి.సుష్మ, 9959705519