కలకత్తా చీకటి గది ఉదంతం అంటే ఏమిటి?

పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ హిస్టరీ
భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో బెంగాల్‌కి ఒక విశిష్టమైన స్థానముంది. మొఘల్‌ సామ్రాజ్యంలో ఆంగ్లేయులు ఆక్రమించిన మొదటి రాష్ట్రం బెంగాల్‌. ఫ్రెంచ్‌, బ్రిటీషు వ్యాపార కంపెనీలకు సంబంధించిన ప్రధాన స్ధావరాలు బెంగాల్‌లోనే ఉండేవి. బెంగాల్‌లోని చంద్రానగర్‌ ఫ్రెంచ్‌ వారికి ప్రధాన స్ధావరంగా ఉంటే, కలకత్తా బ్రిటీషు వారికి ప్రధాన స్ధావరంగా ఉండేది. క్రీ.శ. 1700వ సంవత్సరంలో ఔరంగజేబు కాలంలో ముర్షిద్‌ కులీఖాన్‌ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితుడయ్యాడు. ముర్షిద్‌ కులీఖాన్‌ ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయటంతో పాటు అనేక పట్టణాల నిర్మాణాన్ని కూడా చేపట్టాడు. ముర్షిద్‌ కుజ్‌ అనే నగరం ఆయన నిర్మించిందే. ముర్షిద్‌ కులీఖాన్‌ను ‘ఆధునిక స్వాతంత్య్ర బెంగాల్‌ రాజ్య స్ధాపకుడు’ అని కూడా పిలిచేవారు. అనంతర కాలంలో ముర్షిద్‌ కులీఖాన్‌ మనవడు సర్ఫరాజ్‌ ఖాన్‌ని వధించి ఆలీవర్ధిఖాన్‌ ఆ ప్రాంతానికి పాలకునిగా ప్రకటించుకున్నాడు. ఇటు దక్షిణ భారతదేశంలో ఆంగ్లో – కర్ణాటక యుద్ధాలు ముమ్మరంగా జరుగుతున్న కాలంలో ఆలీవర్ధిఖాన్‌ బెంగాలు పాలకుడిగా ఉన్నాడు.
ఆ యుద్ధాల ప్రభావం దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు బెంగాల్‌ మీద కూడా ఉండేది. ఆలీవర్ధిఖాన్‌ మరణించాక అతని మనవడు సిరాజుద్దౌలా బెంగాల్‌ సింహాసనాన్ని అధిష్టించాడు. సిరాజుద్దౌలా పట్టాభిషేక కార్యక్రమాన్ని ఆంగ్లేయులు బహిష్కరించారు. సిరాజుద్దౌలాకి ఆది నుండి బ్రిటీషు వారంటే గిట్టేది కాదు. కలకత్తా ప్రధాన స్ధావరంగా ఏర్పాటు చేసుకున్న బ్రిటీషు ప్రభుత్వం ఆ ప్రాంతాలలో రక్షణ కోటలు నిర్మాణాన్ని కొనసాగించాలనుకుంది. సిరాజుద్దౌలా ఈ ప్రయత్నాలకు గండి కొట్టాడు. కలకత్తా పరిసర ప్రాంతాలలో ఆంగ్ల, ఫ్రెంచి కంపెనీలు తమ వర్తక స్ధావరాలు, రక్షణ కోటల నిర్మాణాలను చేపట్టరాదని హుకుం జారీ చేశాడు. సిరాజుద్దౌలా ఆజ్ఞలను అంగీకరించిన ఫ్రెంచి కంపెనీ తన నిర్మాణాలను నిలిపి వేసింది. కానీ బ్రిటీషు కంపెనీ ఆ ఆజ్ఞలను ఏమాత్రం పట్టించుకోకుండా తమ నిర్మాణాల కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించింది. దీంతో ఆగ్రహౌదగ్ధుడైన సిరాజుద్దౌలా 1756లో 3వేల మంది సైనిక బలగంతో దండెత్తి వెళ్లి ఆంగ్లేయుల వర్తక స్ధావరాలైన కాశీం బజార్‌, కలకత్తాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆక్రమించుకున్న తర్వాత కలకత్తా నగరానికి సిరాజుద్దౌలా ఆలీ నగర్‌గా నామకరణం చేశాడు. ఈ నగరానికి మాణిక్‌ చంద్‌ని పాలకుడిగా నియమించాడు.
ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ధాటికి ఎదురు నిలవలేమని గ్రహించిన అప్పటి గవర్నర్‌ జాన్‌ డ్రక్‌, తన అధికారులు, సైనికులతో హూగ్లీ నదిలో ఒక పడవ ద్వారా ఫూల్టాన్‌ దీవికి తప్పించుకుని పారిపోయాడు. పారిపోగా మిగిలిన వారిని సిరాజుద్దౌలా సైనికులు బంధింస్తారు. 1756 జూన్‌ 20న కలకత్తాను ఆక్రమించుకునే సందర్భంలో పట్టుబడిన 146 మంది బ్రిటీషు సైనికులను ఒక చిన్న గదిలో బందిస్తాడు. కొంత మంది చరిత్రకారులు వీరిని ఆ గదిలో బంధించమని సిరాజుద్దౌలా ఆదేశించలేదని, ఆయన పరోక్షంలో బ్రిటీషు సైనికులకి, సిరాజుద్దౌలా సైనికుల మధ్య జరిగిన వాగ్వివాదం కారణంగా సిరాజుద్దౌలా సైనికులే వారిని కేవలం ఆరుగురిని బంధించడానికి నిర్మించిన ఒక చిన్న గదిలో వారిని బంధించారని వారి రచనలలో పొందు పరిచారు. ఒక రాత్రంతా వారిని ఆ చిన్న చీకటి గదిలో బంధించటం వల్ల ఊపిరి ఆడక 123 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం 23 మంది బతికి బయట పడ్డారు. ఈ ఉదంతం అంతటినీ ఆ ఘటన నుండి బ్రతికి బయటపడిన సైనికులలో ఒకడైన హల్‌ వేల్‌ తను స్వయంగా రచించిన ‘ది బ్లాక్‌హౌల్‌ ట్రాజెడీ’ అనే గ్రంధంలో వెల్లడించాడు. ఈ ఘటననే ఆధునిక చరిత్రకారులు ‘కలకత్తా చీకటి గది ఉదంతం’గా అభివర్ణిస్తారు. తమ సైనికులు 123 మంది సిరాజుద్దౌలా చేతిలో ప్రాణాలు కోల్పోడాన్ని సహించని బ్రిటీషు ప్రభుత్వం రాబర్ట్‌ క్లైవ్‌ను రంగంలోకి దించుతుంది.
సిరాజుద్దౌలా సేనాని మీర్‌ జాఫర్‌ని లంచం ఆశ చూపి సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా క్లైవ్‌ పథక రచన చేస్తాడు. మరొక పక్క సిరాజుద్దౌలా శత్రువు మరియు ప్రముఖ వర్తక వ్యాపారి అయిన ఆమీన్‌ చంద్‌కి ఫోర్ట్‌ విలియంలో ఆశ్రయమిస్తాడు. తర్వాత జరిగిన పరిణామాల వల్ల తిరిగి కలకత్తా ఆంగ్లేయుల స్వాధీనంలోకి వస్తుంది. పరిస్థిలను అంచనా వేసుకున్న సిరాజుద్దౌలా 1759లో బ్రిటీషు వారితో ఒక సంధి చేసుకుంటాడు. దీనినే ఆలీనగర్‌ సంధి అంటారు. బ్రిటీషు సైన్యం ఫ్రెంచి స్ధావరాలపై దాడి చేయకూడదనేది ఈ సంధి నియమాలలో ఒకటి. ఈ నియమాన్ని ఉల్లఘించి రాబర్ట్‌ క్లైవ్‌ ఫ్రెంచ్‌ వర్తక స్ధావరమైన చంద్రానగర్‌పై దాడి చేసి, ఆ స్ధావరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. దీనికి ఆగ్రహించిన సిరాజుద్దౌలా ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన ఫ్రెంచ్‌ సైనికులకి ఆశ్రయమిస్తాడు. ఇది ఆంగ్లేయులో మరింత ఆగ్రహాన్ని కలిగించటంతో పాటు, ఆ తర్వాత జరిగిన ప్లాసీ యుద్ధానికి ఆజ్యం పోసింది.
1. ఆంగ్లేయులు ఆక్రమించిన మొఘల్‌ సామ్రాజ్యంలోని మొదటి రాష్ట్రం ఏది?
ఎ. కలకత్తా బి. బెంగాల్‌
సి. హైదరాబాద్‌ డి. పైవేవీ కావు.

2. దక్షిణ భారతదేశంలో ఆంగ్లో – కర్ణాటక యుద్ధాలు జరుగుతున్న సమయంలో బెంగాల్‌ పాలకుడు ఎవరు?
ఎ. ఆలీవర్ధిఖాన్‌ బి. సిరాజుద్దౌలా
సి. ముర్షిద్‌ కులీఖాన్‌ డి. పైవేవీ కావు.

3. ఆధునిక స్వాతంత్య్ర బెంగాల్‌ రాజ్య స్ధాపకుడిగా ఎవరిని పిలుస్తారు?
ఎ. ముర్షిద్‌ కులీఖాన్‌ బి. ఆలీవర్ధి ఖాన్‌
సి. సిరాజుద్దౌలా డి. మీర్‌ జాఫర్‌

4. ఏ బెంగాల్‌ నవాబు పట్టాభిషేకాన్ని ఆంగ్లేయులు బహిస్కరించారు?
ఎ. మర్షిద్‌ కులీఖాన్‌ బి. మీర్‌ జాఫర్‌
సి.ఆలీవర్ధిఖాన్‌ డి. సిరాజుద్దౌలా

5. ఆంగ్లేయులు విలియం ఫోర్టు కోటలో ఆశ్రయమిచ్చిన సిరాజుద్దౌలా శత్రువు ఎవరు?
ఎ. ఆమీన్‌ చంద్‌ బి. మీర్‌ జాఫర్‌
సి.హల్‌ వేల్‌ డి. మాణిక్‌ చంద్‌

6. సిరాజుద్దౌలా కలకత్తాను ఆక్రమించుకున్న తర్వాత దానికి ఏ పేరు పెట్టాడు?
ఎ. ఫోర్టు విలియం బి.ఆలీ నగర్‌
సి.చంద్రానగర్‌ డి.ముర్షీద్‌ కుజ్‌

7. కలకత్తా చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగింది?
ఎ. 1756 జనవరి 20 బి. 1756 జూలై 20
సి. 1756 జూన్‌ 20 డి. పైవేవీ కావు

8. కలకత్తా చీకటి గది ఉదంతంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత మంది బ్రతికారు?
ఎ.146 మందిలో 123 మంది చనిపోగా 23 మంది బతికారు
బి. 146 మందిలో 23 మంది చనిపోగా 123 మంది బతికారు
సి. 148 మందిలో 124 మంది చనిపోగా 24 మంది బతికారు
డి. 148 మందిలో 24 మంది చనిపోగా 124 మంది బతికారు

9. కలకత్తాను ఆక్రమణ ఆనంతరం సిరాజుద్దౌలా ఎవర్ని కలకత్తా పాలకుడిగా నియమించాడు?
ఎ. మీర్‌ జాఫర్‌ బి. మాణిక్‌ చంద్‌
సి. ఆమీన్‌ చంద్‌ డి. హాల్‌ వేల్‌

10. కలకత్తా చీకటి ఉదంతాన్ని వెల్లడించిన బ్రిటీషు సైనికుడు ఎవరు?
ఎ. పాల్‌ వేల్‌ బి. జాన్‌ డ్రక్‌
సి. హాల్‌ వేల్‌ డి. రాబర్ట్‌ క్లైవ్‌

11. కలకత్తా ఉదంతాన్ని వెల్లడిస్తూ హాల్‌వేల్‌ రచించిన గ్రంధం పేరు ఏమిటి?
ఎ. గ్రీన్‌హౌల్‌ ట్రాజెడీ బి. స్మాల్‌హౌల్‌ ట్రాజెడీ
సి. డార్క్‌హౌల్‌ ట్రాజెడీ డి. బ్లాక్‌హౌల్‌ ట్రాజెడీ

12. సిరాజుద్దౌలా పాలకుడిగా ఉన్న కాలంలో బ్రిటీషు గవర్నర్‌ ఎవరు?
ఎ. రాబర్ట్‌ క్లైవ్‌ బి. హాల్‌వేల్‌
సి. జాన్‌ డ్రక్‌ డి. విలియం ఫోర్డ్‌

13. సిరాజుద్దౌలా ధాటికి తట్టుకోలేమని జాన్‌ డ్రక్‌ ఏ దీవికి పారిపోయాడు?
ఎ. అండ్‌మాన్‌ నికోబార్‌ దీవులు బి. ఫ్లూటాన్‌ దీవులు
సి. లక్ష దీవులు డి. పైవేవీ కావు

14. రాబర్ట్‌ క్లైవ్‌ లంచమిచ్చి లొంగదీసుకున్న సిరాజుద్దౌలా సేనాని ఎవరు?
ఎ. మీర్‌ జాఫర్‌ బి. మాణిక్‌ చంద్‌
సి. ఆమీన్‌ చంద్‌ డి. ముర్షిద్‌ఖాన్‌

15. రాబర్ట్‌ క్లైవ్‌, సిరాజుద్దౌలా మధ్య జరిగిన సంధి పేరు ఏమిటి?
ఎ. చంద్రానగర్‌ సంధి బి. ఆలీనగర్‌ సంధి
సి. కలకత్తా సంధి డి. పైవేవీ కావు
సమాధానాలు
1.సి 2.ఎ 3.ఎ 4.డిి 5.ఎ 6. బి 7. సి 8. ఎ 9. బి 10.బి 11. డి 12.సి
13. బి 14. ఎ 15. బి
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love