ఎవరు

ఎవరు రగిల్చిన చిచ్చు మనిషితనం కాలిపోతుంది
జాతుల పోరులో ఆడబిడ్డలని
ఫణంగా పెడుతున్నదెవరు
ఎక్కడివీ కత్తులు పచ్చని నేలన
విద్వేషం ఏరులై పారుతోంది
సోదరుల మధ్య గట్టు పంచాయితీ పెట్టిందెవరు…

వెలుగు కళ్ళు మూసివేసి చీకటిని ప్రేమిస్తుంది ఎవరు
జనమంతా ఓటర్లై ఎందుకు కనిపిస్తున్నారు
ఏ ఓట్లు మనవి ఏ ఓట్లు మనవి కావు
చెవులను మూసుకుని నోటికి తాళం పెట్టుకున్నదెవరు…

అందరి మనసులు తెల్ల కాగితాలు
ఆకలి కడుపుకు అన్నమే మతం
ఖాళీ చేతులకు పనే కులం
కంచెల గీతలు గీస్తున్నదెవరు…

వీధి వీధినా పిశాచాల విజయయాత్ర వికటాట్టహాసం
మూత్రంతో మానవత్వాన్ని మసి చేస్తున్నదెవరు
పాతాళం నుండి మొలుచుకొచ్చిన శవాలకి ప్రాణప్రతిష్ట
తల్లి నగత్వాన్ని ఊరేగిస్తున్న ఈ రక్కసులెవరు…

– అశోక్‌ గుంటుక, 9908144099