‘ప్రస్తుత మన గుండెలను మండిస్తున్న మణిపూర్ ఘటన చాలా అంశాలను చర్చకి తెచ్చింది. అందులో ముఖ్యమైనది పాలక వర్గాలకి ఉన్న బహుముఖ ప్రయోజనాలను తెలియజేస్తుంది. రాజకీయాల కోసం ఆర్థిక వనరులు, ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయాలు పెనవేసుకున్నాయి. మతతత్వ ప్రభుత్వం చేతిలో మతమనేది ఎలానూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టగలిగిన బలమైన ఆయుధం. వీటన్నిటినీ అమలు చేయడానికి యుద్ధభూములు కావాలి. అందుకోసం పితృస్వామిక సమాజం స్త్రీల శరీరాల మీద పురుషులకి ఇచ్చిన హక్కులు పని సులువు చేస్తాయి. స్త్రీ, పురుష సమానత్వం సరే, నైతికత సరే, పాతకాలంలో ప్రజలు పాటించిన పాపభీతి అనేది కూడా లేకుండా స్త్రీల శరీరాల మీదుగా రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆధిపత్య పోరు సాగుతోంది. ఇక ఇపుడు భయమల్లా ఈ నగత అలవాటుగా మారుతుందేమోనని. అందుకే ఇలాంటి ఘటనలను ఐక్యంగా తిప్పికొడదాం’ అంటున్న కొందరు రచయిత్రుల మనోభావాలు నేటి మానవిలో…
నిద్ర నటిస్తున్నాడు
మన దేశాధినేత సెక్యులర్ దేశమైన భారత దేశాన్ని హిందూదేశంగా మార్చాలన్న కుతంత్రంతో వర్గాలలో వైషమ్యాలను సృష్టిస్తున్నాడు. స్త్రీలపై పాశవికంగా అ(హ)త్యాచారాలు చేయడానికి కారణ మౌతూ ఏమీ తెలియనట్లు నిద్ర నటిస్తున్నాడు. యూనిఫాం సివిల్ కోడ్‌కు కంకణం కట్టుకుని, బీజేపీ పాలిత రాష్ట్రాలు నేరాలు ఘోరాలు చేస్తూ, పోలీస్ స్టేషన్ల ఆయుధాలను చేజిక్కించుకుంటున్నా నిస్సిగ్గుగా మౌనం వహించడం హేయమైన చర్య. సుప్రీంకోర్టు, ప్రపంచమంతా ఈ చర్యను గర్హిస్తున్నది. ఇప్పటికైనా ‘మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని గుర్తించి మణిపూర్లో ముందు ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలె. నిష్పక్షపాతంగా బాధ్యతను నిర్వర్తిస్తాను అన్న ప్రమాణ స్వీకారం మాటలను గుర్తు తెచ్చుకుని అక్కడి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రధానికి ఉంది. లేదంటే తనైనా రాజీనామా చేయాలి.
– తిరునగరి దేవకీదేవి
ప్రభుత్వాల ఏకతా యజ్ఞంలో భాగం
పచ్చని కొండల కింద ఉన్న ఔషధ, ఖనిజ సంపదలపై ఆధిపత్యానికి యుద్ధభూమిగా మారింది మణిపూర్. కొత్తగా గిరిజన హోదా వచ్చిన మెజారిటీ మెయితీలకు, మైనారిటీ కుకీ తదితర గిరిజనులకు మధ్య ప్రయోజనాలకు, అస్తిత్వానికి మధ్య అగ్గి పుట్టించి, ఊళ్లకు ఊళ్లను కాలబెట్టటం, ఇళ్లను, ప్రార్ధనా స్థలాలను, చరిత్ర గుర్తులను ధ్వంసం చేయటం, మనుషులను చంపటం, స్త్రీలను నగంగా మార్చి, పరిగెత్తించి వెంటాడి, వేధించి, హింసించి అత్యాచారం చేసి, చంపటమూ ప్రభుత్వాల ఏకతా యజ్ఞంలో భాగం. ఇలాంటివి వంద జరిగాయని మణిపూర్ ముఖ్యమంత్రి యథాలాపంగా చెప్పటం గుర్తు పెట్టుకోవాలి. ఈ ఘర్షణలలో ఆత్మగౌరవాన్నే కాదు, కుటుంబాలను కోల్పోయిన కుకీ గిరిజన స్త్రీలందరి దుఖం మనదే. వాళ్ళకోసం రచన అవుదాం. వనరుల ఆధిపత్యం కోసం మెయితీలను రెచ్చగొట్టి, మెయితీ స్త్రీలను కుకీ స్త్రీలపై అత్యాచారాలకు ప్రోత్సాహకులుగా మార్చిన కార్పొరేట్ ఫాసిజం గురించి కూడా ఆలోచిద్దాం.
– కాత్యాయనీ విద్మహే
ఫాసిజం ఎవ్వరినీ వదలదు
రాజకీయ ఎత్తుగడ లలో భాగంగా నాటి ద్రౌపది నుండి నేటివరకూ అందరి ప్రతాపాలు మహి ళల మీదనే. జరిగిన ఘోరం లో తక్కిన సమాజం పాత్ర ఏమిటి? 78 మంది మహిళా పార్లమెంట్ సభ్యులు, 11 మంది కేంద్ర మంత్రులు, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు, మానవ హక్కుల కమిషన్లు, రాష్ట్ర అసెంబ్లీ మహిళలు, రాష్ట్రమంత్రులు, 11569 మంది మహిళ ఐఏఎస్‌లు, ఇలా అన్నిరంగాలలో సాధికారత సంధించిన మహిళలున్నారు. వీళ్ళు తక్కిన మహిళల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారు? ఈరోజు మణిపూర్లోని మహిళలు మైనారిటీలు కదాని మిన్నకుంటే రేపు ఫాసిజం ఎవ్వరినీ వదలదన్న విషయం తెలుసుకోవాలి. రైతు సమస్యల పట్ల, నిర్భయ పట్ల వచ్చిన స్వచ్ఛంద ప్రజా విప్లవం నేడు ఎందుకు మౌనంగా ఉంది. అధికార పక్షమే చేస్తున్న దమన కాండకు ఎవ్వరూ పెదవి విప్పలేక పోతు న్నామా, భయపడుతున్నామా, మణిపూర్‌తో మనకేమిటి అనుకుంటున్నామా అందరం ప్రశ్నించుకోవాలి.
– పి. రాజ్యలక్ష్మి
ఈ హింస ఏమిటి?
ఎన్ని మతాలవారినైనా, ఎన్ని కులాలవారినైనా, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా కలుపుకుని కడుపులో పెట్టుకుని ఆదరిస్తా మని చెప్పే భారతదేశంలోనే ఈ ఘోర సంఘటన జరిగిందా? అందరూ సమానమనే కదా ఓట్లడిగే ముందు నాయకులు వాగ్ధానం చేసింది. మరి ఈ హింస ఏమిటి? భయానక వాతావరణంలో స్త్రీల ఆర్తనాదాలతో, ఆక్రందనలతో ఆ ఊరేగింపు లేమిటి? పాలించే నాయకులే మయ్యారు? రక్షించే ఖాఖీలు భక్షకులయ్యారా? ఆ అభాగ్యులను అవకాశం ఉండీ ఆదుకోనివారూ, పదవులలో సురక్షితంగా కూర్చున్న వారూ, ఈ దారుణ మారణకాండలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవాళ్ళందరూ శిక్షార్హులే. ఇలాంటి వికృత సంఘటనలకు అడ్డుకట్ట కట్టాల్సిందే.
– అమరజ్యోతి
కలిసి కట్టుగా ఎదుర్కొందాం
‘జాతికి గ్రహణం పట్టిన వేళ, మాతృభూమి మొర పెట్టిన వేళ’ అని కవి వాపోయినట్లుగా నేటి అరాచకాల అత్యాచారాల భారతం కల్లోల పరుస్తుండటం పెను విషాదం. రాజకీయాలు, మతం జతకట్టి ఆదివాసీ, దళిత, మైనారిటీ సమూహాలపై చేస్తున్న దాడులు, లౌకిక ప్రజాస్వామ్య వాదులపై బెదిరింపులు, నిర్బంధాలు పతనమైన సాంస్కృతిక విలువల శిథిలావస్థను చూపుతు న్నాయి. భరతమాతకు వారసులైన మహిళలను అవమానించడం, హింసించడమే మతధర్మం, దేశభక్తి, అసలు రాజకీయమని పాలకులు పెద్దలు నిరూపించదల్చుకుంటె అదే పెద్ద సంక్షోభం. కలిసికట్టుగా ఎదుర్కొందాం మనమందరం.
– అనిశెట్టి రజిత
దాడి జరిగేది ముందు స్త్రీపైనే
మనకి మణిపూర్ ఉదంతం కొత్తా కాదు. రేపు జరగదు అన్న నమ్మకమూ లేదు. ఏ సమూహంలో అయినా దాడి జరిగేది ముందు స్త్రీ పైనే. స్త్రీని గౌరవించ మని పదేపదే చెప్పేది ఈ దేశమే, దాడి చేసేదీ ఈ దేశమే. అయితే ఏ స్త్రీని దెబ్బ కొడుతుంది? ఏ స్త్రీ దాడికి గురవుతూనే ఉంది? ఏ స్త్రీ నిరాకరణకి లోనవుతూనే ఉంది? అన్న ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఏ స్త్రీలు క్షేమంగా ఉన్నారో తెలుస్తుంది. నిమ్న జాతి స్త్రీలపై హింసను ఆపండి అని ఎవరిని బతిమిలాడితే ఈ ఘోరాలు ఆగుతాయో!
– మానస ఎండ్లూరి
సిగ్గుమాలిన సంఘటన
సమాజంలో నిరంతరం దళితులు, మైనా రిటీలు, ఆదివాసీలపై, స్త్రీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వేధింపులు, అవమా నాలకు అంతే లేకుండా పోయింది. అట్లాంటి అతి దారుణమైన సంఘటనయే మణిపూర్‌లో జరి గింది. ముగ్గురు మహిళలను నగంగా ప్రదర్శించి, వారిలో ఒక మహిళపై అత్యాచారం చేసి వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను శారీరకంగా, మానసికంగా హింస కు గురి చేశారు. స్త్రీలు భరతమాత ప్రతినిధుల నడం ఉట్టి మాటల్లోనే అనడానికి ఈ సిగ్గుమాలిన సంఘటనలే నిదర్శనం. పేరుకేనా లౌకికరాజ్యం, ప్రజాస్వామ్యం, సమాన హక్కులు, దేశభక్తి. మణి పూర్‌తో సహా అంతటా పీడిత వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాలను ప్రశ్నించడం, సంఘటితమై ఖండించడం మనందరి కనీస బాధ్యత.
– డా. కొమర్రాజు రామలక్ష్మి
రేపు మన వరకు రావొచ్చు
భారతదేశ ప్రథమ పౌరురాలు ఒక గిరిజన మహిళ. గిరిజన స్త్రీల మాన ప్రాణాల మీద అమానుష కరంగా హత్యాచారాలు నోరు మెదపక పోవడం దుర దృష్టకరం. గిరిజన స్త్రీలపైన సాముహిక అత్యా చారాలు, హత్యలు జరగ డానికి కారణం జాతి, కుల, మత, లింగ, వివ క్షత. వీటి వల్ల హింసకు గురవ్వడం ఒక ఎత్తు అయితే, వనరుల కోసం జరిగే హింస మరొక ఎత్తు. ఇక్కడ వేటాడబడేది, బలయ్యేది, బాధితులుగా మిగిలేది కేవలం స్త్రీలు మాత్రమే. నిన్న గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ గడ్‌లలో, ఈ రోజు మణిపూర్లో, రేపు మన వరకు కూడా వ్యాపించే ప్రమాదమున్నది. ఈ మారణ హోమాలను సృష్టించి, మతోన్మాదులను, నర హంతకులను పెంచి పోషిస్తున్నది ఎవరు? పాలకులు కాదా. పైకి మాత్రం ‘బేటీ బచావో బేటీ – బేటీ పడావో’ వంటి అమలు చేయని నినాదాలు బాగా ఇస్తారు.
– లావుడ్య సుజాత
ఒక విరోధాభాస
మండుతున్న మణిపూర్లో మానవ హక్కులు మంట గలిపి మైనారిటీలు, స్త్రీలు, పిల్లల మీద అమానవీయమైన దాడులను ఖండిస్తున్నాను. నిన్న గుజరాత్ నేడు మణిపూర్. మనం ఇలాగే మౌనం వహిస్తే రేపు మరొకరు. వీటికి రాజకీయ నాయకులు, పోలీసుల మౌనం శోచనీయం. మూకుమ్మడిగా మతోన్మాదంతో స్త్రీల మీద దాడులకు, అత్యాచారాలకి దిగుతున్నారు. అటు మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రిగానీ ఇటు రాష్ట్రపతి, ఇతర కేంద్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడం బాధాకరం. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా వున్న దేశంలో గిరిజన స్త్రీలనే ఇలా నగంగా ఊరేగించడం ఒక విరోధాభాస.
– డి. లక్ష్మీ సుహాసిని
ప్రజలను వంచిస్తూనే ఉన్నారు
మణిపూర్లో మహిళలపై అఘాయిత్యాలు, సామూహిక లైంగికదాడులు చేస్తున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇది కొత్తగా జరిగినది కాదు. అమృతోత్సవం జరుపుకుంటున్న దేశంలో ఏదో ఒక ఆరని చిచ్చు రగులుకుంటూనే ఉంది. సమాజంలో ఎక్కడ ఏ ఘర్షణ జరిగినా బలయ్యేది ప్రధానంగా మహిళే. ఒక వర్గాన్ని అవమానించాల్సి వచ్చినప్పుడల్లా మరో వర్గం మహిళ వివస్త్ర కావాల్సిందేనా? కులాన్నో మతాన్నో తాడుగా పేని మెడకి తగిలించి దేశమంతా ప్రదర్శించి భయభ్రాంతులను చేయాల్సిందేనా? ఇక్కడ స్త్రీలు పూజింపబడతారని భుజాలు చరుచుకుంటునే ఉన్నాం. స్త్రీని పూజించనక్కర్లేదు, ఒక మనిషిగా చూడండి. స్వార్థంతో ఈ తరహా విద్వేషాలను రగిలించి ప్రజల్ని రక్షిస్తామని మోసగించకండి. ఎప్పటికప్పుడు ప్రజలను వంచిస్తూనే ఉన్నారు. మహిళలకు రక్షణగా ఏ చట్టాలూ, న్యాయాలూ నిలబడడం లేదు.
– శీలా సుభద్రాదేవి