– కెసిఆర్‌కు దత్తతపుత్రుడు భట్టి
– అవకాశవాది కమల్ రాజు
– ఎన్నికల ప్రచార సభలో సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ -ముదిగొండ
పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై పోరాడే వారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని సిపిఐ(ఎం) మధిర నియోజకవర్గ అభ్యర్థి పాలడుగు భాస్కర్ అన్నారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావుతో కలిసి పాలడుగు భాస్కర్ ముదిగొండ భూపారాట అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్దమండవ, బాణాపురం, కమలాపురం, గంధసిరి, మల్లారం, వల్లభి, పమ్మి, మల్లన్నపాలెం, చిరుమర్రి గ్రామాల్లో ప్రచారం విస్తృతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో మధిర నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓట్లు వేసి గెలిపించాలని పాలడుగు భాస్కర్ ఓటర్లను కోరారు. కార్మిక, కర్షిక, మహిళ, రైతులు దళిత, బడుగు బలహీన వర్గాల సమస్యలే లక్ష్యంగా సిపిఐ(ఎం) ఉద్యమిస్తుందన్నారు. పేద ప్రజల సమస్యలు పరిష్కారానికి ఎర్రజెండే మార్గంమన్నారు. ఉద్యమించే నాయకులను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపితే ప్రజా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. మధిర నియోజకవర్గంలో సిపిఐ(ఎం) ఎమ్మెల్యేలగా గెలిసి ప్రజలకు అండగా నిలిచిన బోడేపూడి వెంకటేశ్వరరావు, కట్టా వెంకటనరసయ్య మధిర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. సిపిఐ(ఎం) ఎమ్మెల్యేల హయాంలోనే మధిర నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. బాజి హనుమంతు పాలేరులో గెలిసి ఈప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేశారన్నారు. అమరవీరుల ఆశయాలే సాధనగా పార్టీయే శ్వాసగా,ఉద్యమమే ఊపిరిగా పనిచేస్తున్న ఎర్రజెండాను మధిరలో ఎర్రజెండా ఎగరవేయటం ఖాయమన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు సిపిఐ(ఎం) గెలుపుకు అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో మూడు పర్యాయాలు గెలిచిన మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. మల్లు భట్టి విక్రమార్క కేసీఆర్‌కు దత్తతపుత్రుడని, బీఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు అవకాశవాదని పాలడుగు విమర్శించారు. తనను గెలిపిస్తే అసెంబ్లీలో ప్రజా గొంతుకగా గళం విప్పుతానన్నారు. ప్రజల ముందుకు మాయమాటలతో గారెడు చేస్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారన్నారు. డబ్బు అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిప్పుకొట్టాలన్నారు.కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వాసిరెడ్డి వరప్రసాద్, బండి పద్మ, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, నాయకులు కందిమల్ల తిరుపతి, మాదారపు శ్రీనివాసరావు, పాలవాయి పాండురంగారావు, పండ్రకొల రాంబాబు, టిఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య చింతకాయల రామారావు, మరికంటి నరసింహారావు, వత్సవాయి సైదులు, మొక్క సత్యనారాయణ, తేజావత్ వెంకటేశ్వర్లు, కె.కుటుంబరావు, కె.రామచంద్రం, మరికంటి వెంకన్న చావా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చిరుమర్రిలో అపూర్వ స్వాగతం
చిరుమర్రిలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ ఆధ్వర్యంలో పాలడుగు భాస్కర్‌కు పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి పూలతో అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు, మహిళలు, యువతి, యువకులు, సానుభూతిపరులు ప్రజలు ఎన్నికల ప్రచార ర్యాలీలో అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా నాయకులు బుగ్గవీటి సరళ, నాయకులు కోలేటి ఉపేందర్,అరుణ పయ్యావుల ప్రభావతి, మోర రామకృష్ణ, బండి శేఖర్, సామినేని రామయ్య, పమ్మి గ్రామసర్పంచ్ కొండమీద సువార్త రఘుపతి తదితరులు పాల్గొన్నారు.