ప్రచార అస్త్రాల ‘యోగా’ తాత్విక మూలాలు

యోగా దినంగా జూన్‌ 21 ఎంపికలో హిందుత్వ మూలాలను స్మరించుకునే దృఢ ప్రయత్నం దాగుంది. ”యోగా చేయనివారు దేశం వదలాలి. సూర్య నమస్కారాలు చేయనివారు సముద్రంలో దూకాలి” అని బుల్డోజర్‌ సంస్కృతి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మతోన్మాద విషం చిమ్మారు. మోడీతో సహా సంఘీయులంతా ప్రాచీన హిందూరుషులు జ్ఞాన సంపన్నులని, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలన్నీ వైదిక కాలం నుండే ఉన్నాయని ప్రవచించారు. అశాస్త్రీయ అంశాలను ప్రజలు నమ్మేటట్లు యోగా ప్రహసనం రూపొందించారు.
జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినంగా తాను ప్రతిపాదించగా ఐక్య రాజ్య సమితి ఆమోదించిందని మన ప్రధాని గర్విస్తారు. 18జూన్‌23 మన్‌కీ బాత్‌లో 2023 యోగా దిన ఇతివృత్తంగా ‘వసుధైవ కుటుంబకానికి యోగా’ అని ప్రధాని ప్రకటించారు. ఇది ‘ఒక విశ్వం ఒక కుటుంబం ఒక భవిష్యత్తు’ అన్న ఆకాంక్షలకు ప్రతిబింబం. మతోన్మాద ప్రభుత్వ ఈ లక్ష్యం ప్రపంచాన్ని మోసగించ డానికే. మోడీ ప్రతి సందర్భాన్ని స్వార్థానికి వాడుకుంటారు. 13 మార్చి 23 నుండి 21జూన్‌ 23 వరకు వంద రోజులు, వంద నగరాలలో, వంద సంస్థలు వివిధ కార్యక్రమాలు చేస్తున్నాయి. యోగా భారతమాల పథకం కింద మన సైనిక త్రివిధ దళాలు యోగా ప్రచార కార్యక్రమాలు చేస్తాయి. ప్రతి ఇంటా యోగా పేరుతో నగరాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో యోగా కార్య క్రమాలు, సాధన చేపట్టారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా 75 ముఖ్య ప్రదేశాల్లో ప్రతిరూప ప్రచార యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. వీటిల్లో ప్రజల సొమ్ముతో ప్రజలపై సంఫ్‌ు భావజాలాన్ని, బీజేపీ జిత్తులను రుద్దుతారు. తన విదేశీ యాత్రలో 21జూన్‌23న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయంలో యోగా దిన సమావేశాలకు ప్రధాని నాయకత్వం వహిస్తారు.ఈ కార్యక్రమా లలో గృహ, ఆరోగ్య, విద్య, విదేశ, రక్షణ మొదలగు మంత్రిత్వ శాఖల అనుబంధ విభాగాలనన్నిటిని వాడుకుంటున్నారు. జూన్‌ 21సంఫ్‌ు తాత్వికతతో ముడిపడింది. ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు’ వ్యవస్థాపకుడు కేశవ్‌ బలిరామ్‌ హెగ్డేవార్‌ మరణించిన రోజది. మోడీ ప్రతిపాదించిన ప్రథమ ప్రపంచ యోగా దినం 2015, జూన్‌ 21 ఆయన 75వ వర్ధంతి. శివుడు ప్రథమ భిక్షువు. ప్రథమ యోగి. పార్వతి ప్రథమ యోగిని. ఐరాసకు యోగా దినం గురించి నచ్చజెప్పాలన్న ఆలోచన 20ఏండ్ల నాటిది. 2011 బెంగళూరు యోగా సమ్మేళనం తర్వాత ఈ వ్యూహం ఊపందుకుంది. శ్రీశ్రీ రవిశంకర్‌ ఆధ్వర్యంలో స్వ.బి.కె.ఎస్‌. అయ్యంగార్‌, రాందేవ్‌ వగైరా యోగా గురువులు జూన్‌ 21ని యోగా దినంగా ప్రకటించాలని ఐరాసకు నివేదించారు. వీరంతా ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేశారు. కృతజ్ఞతాపూర్వకంగా మోడీ వీరిని అంతర్జాతీయ యోగా గురువులను, బహుళజాతి వాణిజ్య వేత్తలను చేశారు.
యోగాతో ఆరోగ్యం బాగుపడు తుందని యోగుల వాదన. ఇది కండరాల నియంత్రణతో మానసిక ప్రశాంతతను కలిగించవచ్చు. శరీరంలో అనవసర కార్బొహైడ్రేట్లను, కొవ్వును కరిగించలేదని వైద్యుల నివేదిక. యోగా అద్భుత ఔషధం కాదని భారత ప్రెస్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జస్టిస్‌ సి.కె.ప్రసాద్‌ అన్నారు. కొన్ని ఆసనాలు వెన్నెముక నొప్పులు, నరాలపై వత్తిళ్ళు కలిగి స్తాయని నరాల నిపుణులన్నారు. తమ రాజకీయుల మతాశయా లను బ్రాహ్మణత్వం యోగాతో మభ్యపెడు తుందని విజ్ఞుల భావన. ”స్వేచ్ఛ, దైవవిముక్తి భారత ఉన్నత ఆశయాలు. గాడ్‌ విదేశీ పదం. మనుషులను దేవతలు పొగిడారు. శివుడు, రాముడు, కృష్ణుడు ఈ భూమిపై పుట్టారు తిరిగారు. అంతిమ సంక్షేమానికి శరీరాన్ని వాడితే కర్మయోగ, మనసును ఉపయోగిస్తే జ్ఞానయోగ, భావాలను వినియోగిస్తే భక్తియోగ, శక్తిని ఉపయోగిస్తే క్రియాయోగ. ఇది ఆధ్యాత్మిక మత పద్ధతి. ‘యోగా అనగా ఐక్యం.’ అని ఈశా ఫౌండేషన్‌ అధినేత జగ్గీ వాసుదేవ్‌ ప్రవచనం. యోగా హిందుత్వ పురాణ అవాస్తవ కథలకు ముడిపెట్టబడింది. అంతర్జాతీయ యోగా దినం జూన్‌ 21 ఒక పురాణ గాథకు సంబంధించిందే.
జూన్‌ 21తో దక్షిణాయన పుణ్యకాలం మొదలవుతుంది. యోగిక పరివర్తన ప్రకారం ఈ రోజు తర్వాత సూర్యుడు తన ప్రయాణ దిశను ఉత్తరం నుండి దక్షిణానికి మార్చుకుంటాడు. ఈ పుణ్యదినాన శివుడు ఆదియోగిగా అవతరిం చాడని పురాణ ఘోష. శివుని ఈ పరివర్తన తన్మయత్వ మానసికస్థితితో ఆవేశపూరిత నాట్యంగా మారిందని పండిత ప్రవచనం. వీక్షకులకు శివతాండవం అర్థం కాలేదు. శివుడు చాలాకాలం నాట్యం చేశాడు. అంతకాలం ఆగలేని ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఏడుగురు మిగిలారు. శివుడు స్పృహలోకి రాగానే ఆ ఏడుగురు తమకు జ్ఞానాన్ని బోధించమని శివున్ని ప్రార్థించారు. ‘ఇది వినోదం కాదు. ఈ స్థితిలో మీకు అర్థం కాదు. ప్రగాఢ సంసిద్ధతను సంతరించుకోండి. సంసిద్ధులై రండి.’ అని శివుడు వారిని పంపించాడు. శివుని రహస్య జ్ఞానాన్ని గ్రహించడానికి ఈ ఏడుగురు తపస్సు చేశారు. 84ఏండ్ల తపోసాధన తర్వాత సూర్యుడు దక్షిణాయనం ప్రారంభించిన శుభసమయాన పౌర్ణమి నాడు (జూన్‌ 21) శివుడు ఆ ఏడుగురి సంసిద్ధత పూర్తయిందని గ్రహించాడు. మరో 28దినాలు వారిని గమనించి, తదుపరి పౌర్ణమి రోజున ఏడుగురికి గురువుగా వ్యవహరిస్తానని తెలిపాడు. ఆ పుణ్యదినమే సంఘీయ గురు పూర్ణిమ. ఈ కోణంలో యోగా మూల శుభ దినం, మోడీ అంతర్జాతీయ యోగా దినం ఒకటే. హిందుత్వ కథ నాలకూ, యోగా దినానికి విడదీయరాని, కాదనలేని బంధం ఉంది. యోగా దినంగా జూన్‌ 21 ఎంపికలో హిందుత్వ మూలాలను స్మరించుకునే దృఢ ప్రయత్నం దాగుంది. ”యోగా చేయనివారు దేశం వదలాలి. సూర్య నమస్కారాలు చేయనివారు సముద్రంలో దూకాలి” అని బుల్డోజర్‌ సంస్కృతి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మతోన్మాద విషం చిమ్మారు. మోడీతో సహా సంఘీయు లంతా ప్రాచీన హిందూరుషులు జ్ఞాన సంపన్నులని, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలన్నీ వైదిక కాలం నుండే ఉన్నాయని ప్రవచించారు. అశాస్త్రీయ అంశాలను ప్రజలు నమ్మేటట్లు యోగా ప్రహసనం రూపొందించారు.
యోగా అందరిదని, దాని ఆచరణకు హిందుత్వానికి పొంతనలేదని సంఘీయులు నమ్మబలుకుతారు. హఠ యోగలో ఇది నిజం కావచ్చునేమో! ఇతర యోగాలలో నిజంకాదని యోగాసిద్ధుల అభిప్రాయం. యోగా అపాయ రహితమని, ఆరోగ్యప్రదాయినని ప్రచారం చేసినా ప్రజల అనుమానం తీరలేదు. బలవంత పురాణంగా, సందేహ విధానాల్లో సంఘీయులు ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. ప్రజల యోగా వ్యతిరేకతను గమనించిన మోడీ ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలను ఇందులో భాగస్వాములను చేసింది. మోడీ యోగా వేడుక, సాంస్కృతిక జాతీయతావాదం, యోగా వ్యాపారీకరణ, సున్నిత బలాత్కారాల కలియిక. ఆధునిక సాధువులను, వారి అనుచరులను యోగ సంఫ్‌ు శిబిరానికి చేర్చింది. మోడీ ప్రభుత్వం యోగా గురువులతో ‘మీకిది. మాకది.’ సూత్రాన్ని పాటించింది. యోగా నిర్వహణలో వీరికి అతి ప్రాధాన్యతనిచ్చింది. ప్రతిగా వీరి ఆర్థిక సాయం, అసంఖ్యాక అనుయాయుల ఓట్లు బీజేపీకి అందాయి. మోదీ ప్రాపకంలో యోగా వ్యాపారం దేశవిదేశాల్లో ఇబ్బడిముబ్బడిగా విస్తరించింది. యోగా సన్యాసులు సహస్ర కోటీశ్వరులయ్యారు. భిన్న భావాల, విభిన్న సంస్కృతుల, బహుళ మతాచారాల దేశం మనది. ఏ అంశం మీదనైనా ప్రజలకు సమాచారమివ్వాలి. దాని ఆచరణను వారి ఇష్టానిష్టాలకు వదిలేయాలి. ప్రభుత్వానికి ప్రజారోగ్య రక్షణ సంకల్పం ఉంటే నివారణా వైద్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రోత్సహించాలి. చౌకగా అత్యవసర మందులు, ఆరోగ్య శాఖకు నిధులివ్వాలి. ప్రజారోగ్యాన్ని కాపాడాలి. జూన్‌ 21, అంత ర్జాతీయ యోగా దినంగానే గాక ”సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రపంచ మార్కెట్‌ కు ఐచ్ఛికంగా అందించిన రోజు” గానూ గుర్తుంటుంది. మన అవసరం యోగా, వైదిక, ఆధ్యాత్మిక, అజ్ఞాన భారతమా? విద్యారోగ్య, వైజ్ఞానిక భారతమా?
ఎస్‌ హనుమంతరెడ్డి
9490204545

Spread the love