నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా కలలను నెరవేర్చుకోవడానికి కొందరు అక్రమమార్గాలను ఆశ్రయిస్తున్నారు. అడ్డదారిన అగ్రరాజ్యం వెళ్లి పట్టుబడుతూ కటకటలాపాలవుతున్నారు. ఈ జాబితాలో భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఏడాది వ్యవధిలోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన 97 వేల మంది భారతీయులు అరెస్టయ్యారు. ఈ విషయాన్ని అమెరికా కస్టమ్స్-బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ప్రకటించింది. అమెరికాకు అక్రమ వలసలపై గురువారం సెనేట్లో కీలకమైన చర్చ జరిగింది. మెక్సికోలో అక్రమ వలసలకు సాయం చేయడం వ్యాపారంగా మారిందని, డ్రగ్స్ అక్రమ రవాణా మూఠాలు వలసదారులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయని సెనేటర్ జేమ్స్ లాంక్ఫోర్డ్ ఆరోపించారు. ఒకవేళ పట్టుబడితే ఎలా తప్పించుకోవాలో, అధికారులకు ఏం సమాధానం చెప్పాలో కూడా శిక్షణ ఇస్తున్నారని అన్నారు. స్వదేశంలో భయానక పరిస్థితుల కారణంగా ఆశ్రయం కోసం వచ్చామని చెప్పాలని శిక్షణ ఇస్తున్నారని చర్చలో భాగంగా పేర్కొన్నారు.