సీబీఐ విచారణకు నో

 రైల్వే మంత్రి రాజీనామా చేయాల్సిందే : 12 ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌
 ఇలాంటి రైల్వే మంత్రినే చూడలేదట !
 కథనాలు వండివారుస్తున్న బీజేపీ అనుకూల మీడియా
భువనేశ్వర్‌ : బాలాసోర్‌ రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరపడాన్ని 12 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. నిస్పాక్షిక విచారణ జరగాలంటే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తక్షణమే రాజీనామా చేయాలని, ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశాయి. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ (ఎం), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆర్పీఐ, ఆప్‌,, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌ స్టార్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌, సమతా క్రాంతిదళ్‌ పార్టీల ఒడిశా రాష్ట్ర శాఖలు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించాయి. సీబీఐ విచారణను తాము తిరస్కరిస్తున్నామని ఆ పార్టీలు స్పష్టం చేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ బీజేపీ ఆదేశానుసారం నడుచుకుంటుందని అవి విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని, కోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరగాలని డిమాండ్‌ చేశాయి. అయితే ఒడిశాలోని అధికార బీజేడీ మాత్రం సీబీఐ దర్యాప్తును స్వాగతించింది. రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలైన దోషిని పట్టుకొని శిక్షిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, దీనికి బాధ్యత వహించి మంత్రి వైష్ణవ్‌ రాజీనామా చేయాలని ఒడిశా పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ విలేకరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు.