టీచర్లు కావాలి పోస్టులు భర్తీ చేయాలి

–  సబ్జెక్ట్‌ టీచర్ల కొరత
–  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లల్లో 28వేల పోస్టులు ఖాళీ
– వార్షిక ఫలితాలపై తీవ్ర ప్రభావం
– ఈ విద్యాసంవత్సరమైనా భర్తీ చేయాలని విద్యావేత్తల విజ్ఞప్తి
ప్రభుత్వ పాఠశాలల్లో ఏండ్ల కొద్దీ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు మెరుగైన విద్య అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నష్టం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్‌ చేస్తోంది.
– గోపి నాయక్‌
టీఎస్‌యూటీఎఫ్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 28వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ ప్రభావం పదో తరగతి, ఇతర తరగతుల వార్షిక పరీక్షల ఫలితాలపై పడుతోంది. ఈ ఏడాది పదో తరగతిలో జీరో ఫలితాలు నమోదైన స్కూల్స్‌ ఉన్న విషయం తెలిసిందే. సబ్జెక్ట్‌ టీచర్ల కొరత ఉండటం, సకాలంలో విద్యావాలంటీర్లను నియమించకపోవడం కూడా బోధనపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం అయినా ప్రభుత్వం చొరవ తీసుకుని ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమోషన్లు జరిగితే మరిన్ని ఖాళీలు పెరిగే అవకాశం ఉంది. వేసవి సెలవుల అనంతరం వచ్చే వారంలో పాఠశాలలు తెరవబోతున్న క్రమంలో ఈ సమస్య తీవ్రతకు ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులపై కథనం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 936 మంది ఉపాధ్యాయులను రేషనైజేషన్‌లో భాగంగా కేటాయించారు. రంగారెడ్డి జిల్లాలో 300 పోస్టులు, వికారాబాద్‌ జిల్లాలో 636 పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఈ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. ప్రస్తుతం సుమారు ఐదు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 2.50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. రంగారెడ్డిలో 1,338 ప్రభుత్వ పాఠశాలల్లో 1.60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 4,800 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వికారాబాద్‌ జిల్లాలో 1032 ప్రభుత్వ పాఠశాలల్లో 90 వేల మంది విద్యార్థులకు గాను 4,330 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 80 మందికి ఒక్కో ఉపాధ్యాయుడు ఉన్నారు. సబ్జెక్ట్‌ టీచర్ల కొరత మరింత తీవ్రంగా ఉంది.
సిబ్బంది కొరత.. తగ్గిన ఉత్తీర్ణత
పాఠశాలల్లో సిబ్బంది కొరతతో ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. విద్యార్థులకు మెరుగైన విద్య అందకపోవడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడుతోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలో నర్సప్పగూడ ఉన్నత పాఠశాలలో తొమ్మిది మందిపదవ తరగతి విద్యార్థులు ఈ ఏడాది ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. అలాగే వికారాబాద్‌ జిల్లాలోని పలు పాఠశాలల్లో సైతం సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. టీచర్ల కొరత ఉన్నచోట్ల ఫలితాలు ఎలా ఆశిస్తామనేది ప్రశ్న.
జిల్లెలగూడలో 1300 మందికి 26 మందే,,
”రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1240 మంది విద్యార్థులున్నారు. ఇందులో ఈ సంవత్సరం 220 మంది ఉన్నత చదువులకు వెళ్లారు. ఈ యేడు మరో 300 మంది చేరే అవకాశం ఉంది. ఈ పాఠశాలల్లో ప్రతియేటా సుమారు 1300 మంది చదువుతారు. అయితే వీరికి 56 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్‌తో కలిపి 26 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. ఒక్కరే హిందీ టీచర్‌ ఉన్నారు. దీంతో ఒక్కో సెక్షన్‌కు హిందీ టీచర్‌ రావడానికి వారం రోజులు పడుతోంది. 40 మంది విద్యార్థులకు ఒక సెక్షన్‌ చేయాల్సి ఉండగా స్కూల్లో గదులు లేక 70 మందికి ఒక సెక్షన్‌ చేశారు.”
600 మందికి పది మందే..
”రాజేందర్‌నగర్‌ పద్మశాలిపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 10 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. 600 మంది విద్యార్థులకు ఒక్కరే గణిత ఉపాధ్యాయుడు ఉన్నారు. బయోసైన్స్‌, సోషల్‌ సబ్జెక్ట్‌లకు కూడా ఒక్కరే ఉన్నారు. ఇదే పరిస్థితి చాలా పాఠశాలల్లో నెలకొంది.”

Spread the love