అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ 25న విచారించాలి

– తెలంగాణ హైకోర్టుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఈ నెల 25న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతవరకూ తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవినాష్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వెకేషన్‌ బెంచ్‌ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు హత్య కేసు దర్యాప్తును ట్రయల్‌ కోర్టు పర్యవేక్షించ వచ్చా.. లేదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌ను జత చేసింది. ఈ రెండింటినీ కలిపి మంగళవారం జస్టిస్‌ జెకె మహేశ్వరి, జస్టిస్‌ పిఎస్‌ నర సింహతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్‌ ధర్మాసనం విచారించింది. వైఎస్‌ వివేకా నంద రెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్‌ 24న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తరువాత కూడా తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోకపోవడం పట్ల సుప్రీం కోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

Spread the love