వికలాంగులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి : సీపీఐ(ఎం)

నవతెలంగాణ-నేలకొండపల్లి
వికలాంగులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని సిపిఎం మండల కార్యదర్శి కెవి రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని చెరువుమాదారం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వికలాంగులు వారితో తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మీసేవ కేంద్రాల వద్ద వికలాంగులు సదరం సర్టిఫికెట్‌ కోసం, స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి ఉదయం 8 గంటల నుండి పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. వికలాంగులు సదరం సర్టిఫికెట్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి అవసరమైన సైట్‌ ఓపెన్‌ చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వానికి వికలాంగుల మీద నిర్లక్ష్య పూరిత కక్ష సాధింపు సరికాదన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ బి వెంకటేశ్వర్లు మంగళవారం నుండి జూన్‌ 27వ వరకు వికలాంగులు సదరం క్యాంపు కొరకు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని ప్రకటనలో తెలియజేశారన్నారు. వికలాంగులు చెరువుమాదారం, నేలకొండపల్లి, కూసుమంచి తదితర మీసేవ కేంద్రాల వద్ద స్లాట్‌ బుకింగ్‌ కోసం గంటల తరబడి వేచి చూడడంతో, మీసేవ నిర్వాహకులు సైట్‌ ఓపెన్‌ కానందున మళ్లీ రావాలని చెప్పడంతో వెనుతిరిగారన్నారు. పగిడిపత్తి నాగేంద్ర, పెదపాక వీరబాబు, శ్యామలేటి చిన్న రాములు అనే వికలాంగులు ఇంటింటికి సిపిఎం పేరుతో వారి ఇండ్లకు వెళ్ళినప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ విషయంలో మండల పరిషత్‌ అధికారులను సంప్రదించగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోమని చెప్పటం నిజమేనని మీసేవ కేంద్రాల్లో సైట్‌ ఎందుకు ఓపెన్‌ కాలేదో కారణం తెలీదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులతో వికలాంగులకు సదరం సర్టిఫికెట్ల కోసం స్లాట్‌ బుకింగ్‌ అందరూ చేసుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎరదేశి నరసింహారావు, పాలకుర్తి బోడయ్య, నాగవల్లి తిరపయ్య, పాలకుర్తి స్వామి, ,పాలకుర్తి బ్రహ్మం, ఎస్కే మైమ్మద్‌, లక్ష్మయ్య, శీలం వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love