ప్రస్తుతం కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తున్నాయి. మరికొన్ని మూడు రోజులు ఆఫీస్‌కు వచ్చి, మూడు రోజులు ఇంటి నుంచి పని చేసేలా అవకాశం కల్పిస్తున్నాయి. ఆఫీస్‌కి వెళ్ళడం అంటే నీట్‌గా రెడీ అయిపోయి వెళ్తాం. కానీ ఇంటి నుండి పని చేయడమంటే రెడీ అవడంలో కాస్తంత అశ్రద్ధ ఉంటుంది. అయితే ఇంటి నుండి పని చేసే సమయంలో ఆన్లైన్, వీడియో కాన్ఫరెన్స్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ మీటింగ్ సమయంలో మీరు ఇంట్లో వుండి వర్క్ చేస్తున్నప్పటికీ ప్రొఫెషనల్‌గా కనిపించాలి. అలాంటి ప్రొఫెషనలిజం కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేమిటో చూద్దాం రండి.
ఆఫీస్‌లో మీ పని ప్రదేశం ఎలా ఉంటుందో మీ హౌమ్ ఆఫీస్ కూడా వీలున్నంత వరకూ అలాగే సెట్ చేసుకోండి. వర్క్ మొదలుపెట్టబోయే ముందే మీ వైర్లెస్ హెడ్ ఫోన్స్, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ .. మీకు ఏవి కావాలనుకుంటే అవి రెడీగా పెట్టుకోండి. మీటింగ్ మధ్యలో పరిగెత్తి తెచ్చుకునే పద్ధతికి స్వస్తి చెప్పండి.
ఆఫీసు ఆఫీసే ఇల్లు ఇల్లే. ఆఫీస్ మధ్యలో ఇంటి పనుల కోసం లేవకండి. ఆఫీసులో ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలాగే ఉండండి. ఆఫీసులో టీవీ చూడరు కదా, ఇంట్లో కూడా చూడకండి. ఇరవై ఐదు నిమిషాలు పని చేశాక ఐదు నిమిషాలు అటూ ఇటూ తిరిగి, మంచి నీళ్ళు తాగి, ముఖం మీద నీళ్ళు చల్లుకుని మళ్ళీ వచ్చి కూర్చోండి. ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కలిసి తీసుకునే టీ బ్రేక్ సమయంలో ఇలా చేయండి.
నీట్‌గా డ్రెస్ అయితేనే ఉత్సాహంగా పని చేయగలం. మనం వేసుకునే బట్టలే మన మూడ్‌ని డిసైడ్ చేస్తాయి. అందుకే మంచి షేడ్స్‌లో ఉన్న డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే హ్యాపీగా పని చేయగలం. అంతే కాక సెలెక్ట్ చేసుకునే షేడ్స్ కూడా కెమెరాకి అనువుగా ఉండాలి. స్ట్రైప్స్, చెక్స్ ఉన్నవి ఆన్లైన్ మీటింగ్స్‌లో అంత నీట్‌గా కనిపించవు. న్యూట్రల్ షేడ్స్‌లో, ప్లెయిన్ కలర్స్‌తో ఉన్న షర్ట్స్ వీడియో కాల్స్కీ, మీటింగ్స్‌కీ బాగా సరిపోతాయి.
కెమెరా ఎప్పుడూ మీ కంటికి ఎదురుగా ఉండేలా లాప్టాప్ అడ్జస్ట్ చేసుకోండి. దాంతో సడన్‌గా ఎటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్‌కి సరిపోయేలా ఐ లెవెల్ ఉంటుంది. అలాగే ఒక కర్చీఫ్ పక్కనే ఉంచుకోండి. మీరు ఐరన్ చేసిన డ్రెస్ వేసుకుని ఉంటే పరవాలేదు. లేదంటే నీట్‌గా ఐరన్ చేసిన లైట్ కలర్ డ్రెస్ ముందురోజే పక్కన పెట్టుకోండి.