తలపుల మడి

తూనీగను చూసినప్పుడల్లా
రెక్కలు విరిచి పట్టుకున్న
నా రెండు వేళ్ళకు నే వేసుకోవాల్సిన
శిక్షేమిటో అర్థం కాకుండా ఉంటుంది

నెమలీకను తల్చుకున్నప్పుడల్లా
రెండయ్యే ఆశ గొంతులో
ఉండ చుట్టుకున్నట్టు అనిపిస్తుంది

వాన చినుకు రాలక ముందే
కోకొల్లల ఉసిళ్లు అద్దం చిమ్నిపైకి
యుద్ధానికి ఎలా వస్తాయో
జవాబు తెలవక
ప్రశ్నే పక్కదారి పట్టింది

కాకులకీ చుట్టాలకి ఉన్న
బాదరాయణ సంబంధం
బామ్మలు ఇప్పటికీ ఎందుకు చెప్పరు ?

ఆటలో అరటి పండు
ఇచ్చింది ఎవ్వరూ లేదు
తీసుకున్నదీ కూడా లేదు

ఇప్పటికీ గెలిచిన వాడిని చూస్తే
చిన్నప్పుడు దొంగాట ఆడినవాడే
ఎందుకో యాదికి వస్తాడు

పంతులుగారు నేర్పిన చదువు కన్నా
పంతులమ్మగారు పెట్టిన పొద్దటి అన్నమే
పదే పదే తలుపుకు వస్తుంది

ఇసుకలో దాగి ఉన్న కర్రపుల్లను
ఆనాడు గుర్తించలేకపోయా
వేళ్ళ మధ్య నుంచి ఇసుకలా జారిపోతున్న
ఆనందాలను ఈనాడు ఆపలేక పోతున్నా

ముళ్లు తప్పించి రేగు పళ్ళు ఏరుకున్న
చాక చక్యం ఇప్పుడు ఎటు పోయిందో
బళ్ళు తెరిస్తే కొత్తబట్టలేసుకున్న పుస్తకాలే కానీ
నాన్న చినుగుల చొక్కా కనిపించేది కాదు

చెట్టు మీద జామ పండు చూస్తే
ఒంటి మీది గోడ దూకిన గుర్తులు
తడుముకుని చూస్కుంటా

గవ్వలేరి గుది గుచ్చి దండ చేసి
వేసుకున్నప్పటి ఆనందం ఇప్పుడు
రవ్వలతో రతనాలతో రావట్లేదేమి ?

బాల్యమే బాగుంది
కలిమి, లేములు కన్ను కొట్టవు
బామ్మ పోయినా
భాద అన్నది తట్టదు
– రెబ్బారం రాంబాబు