బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇంట్లో డ్రగ్స్ పార్టీ

నవతెలంగాణ – హైదరాబాద్
సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ దందాలో సెలబ్రెటీల పేర్లు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. సెలబ్రెటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నట్లు సమాచారం. సినీ రంగంతో పాటు క్రీడారంగంలోని పలువురు ప్రముఖులకు కేపీ డ్రగ్స్ అందించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి నివాసంలో డ్రగ్ పార్టీ జరిగిందని తెలుస్తోంది. లావిష్ గా జరిగిన ఈ పార్టీకి పన్నెండు మంది ప్రముఖులు హాజరయ్యారని, కేపీ చౌదరి ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేశాడని పోలీసు వర్గాల సమాచారం.  అయితే, అలాంటి పార్టీలేవీ తమ నివాసంలో జరగలేదని సిక్కిరెడ్డి తల్లి కొట్టిపారేస్తున్నారు. తన కూతురుపై వస్తున్న ఆరోపణలపై తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. గతంలో తాము రెంట్ కు ఉన్న అపార్ట్ మెంట్ లో కింది ఫ్లోర్ లో కేపీ చౌదరి ఉండేవాడని, అతడు ఏంచేసే వాడనేది తమకు తెలియదని చెప్పుకొచ్చారు.
మరోవైపు, పోలీసుల విచారణలో కేపీ చౌదరి పన్నెండు మంది డ్రగ్ పెడ్లర్లు, ఆరుగురు కన్జూమర్ల పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తోంది. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. రఘుతేజ, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్ రెడ్డి, నితినేష్‌, బెజవాడ భరత్‌, శ్వేత, ఠాగూర్‌ ప్రసాద్‌, వంటేరు సవన్‌ రెడ్డి, చింతా రాకేష్‌ రోషన్‌ అతడి భార్య సాయిప్రసన్న తదితరుల పేర్లు ఉన్నాయి. కేపీ చౌదరి ఫోన్ కాల్ డేటాను పరిశీలించి, ఆయన ఎవరెవరితో మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడనే వివరాలను పోలీసులు సేకరించారు. వారిని కూడా విచారించే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. కొన్నిరోజుల క్రితం వీళ్లంతా కలిసి స్నేహిత హిల్స్‌లోని సిక్కిరెడ్డి నివాసంలో పార్టీ చేసుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. అక్కడ డ్రగ్‌ పార్టీ జరిగినట్లు ఆధారాలు కూడా దొరికాయని సమాచారం. ఈ పన్నెండు మందికి.. డ్రగ్స్‌ పంపిణీ చేసినట్లు పోలీసుల విచారణలో కేపీ అంగీకరించినట్లు తెలుస్తోంది.