ఓపీఎస్‌ కోసం సమైక్య ఉద్యమం

– విశాల ఐక్యవేదికలో భాగస్వామ్యం కండి
– పీఎఫ్‌ఆర్‌డీఏ రద్దు కోసం కొట్లాడుదాం కలిసిరండి
– ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపు
– ఓపీఎస్‌ పునరుద్ధరణ అంశం రాబోయే ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారాలి
– అందుకోసం ప్రజామద్దతు కూడగట్టాలి : ఇన్సూరెన్స్‌ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌ ఆవిర్భావం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ(ఓపీఎస్‌) కోసం జాతీయ స్థాయిలో సమైక్య ఉద్యమం చేయాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నొక్కి చెప్పారు. ఓపీఎస్‌ కోసం తెలంగాణలో విశాల ఐక్యవేదిక ఏర్పడటం మంచి పరిణామమన్నారు. ఆ వేదికలో చేరని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలన్నీ కలిసి రావాలని కోరారు. ఐక్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కొట్లాడితే కచ్చితంగా దిగొస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైల్వేలు, బ్యాంకింగ్‌, బీమా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, లెక్చరర్ల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జాయింట్‌ ఫోరం ఫర్‌ రెస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌(జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌) ఏర్పడింది. ఇందుకోసం నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శంకర్‌రావు, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ప్రధాన కార్యదర్శి అజీజ్‌ అహ్మద్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ..నూతన పెన్షన్‌ విధానాన్ని (ఎన్పీఎస్‌) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తీసుకొచ్చిందని విమర్శించారు. అందులోకి కోటి 75 లక్షల మంది సభ్యులుగా బలవంతంగా నెట్టబడ్డారన్నారు. 1991 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణల ప్రభావం పెన్షన్‌ స్కీమ్‌పై కొట్టొచ్చినట్టు ఉందన్నారు. అంతకుముందు పరోక్షంగా దాడి జరిగిందనీ, 2004 తర్వాత అది ప్రత్యక్షరూపం దాల్చిందని వివరించారు. భవిష్యత్‌లో ప్రమాదం ముంచుకు రాబోతున్నదని అప్పట్లోనే తాము హెచ్చరించామన్నారు. ఎన్పీఎస్‌ ప్రాణం పీఎఫ్‌ఆర్డీఏలో ఉందనీ, దాని రద్దు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఓపీఎస్‌ కోసం ఉద్యమాలు విడివిడిగా జరుగుతున్నాయనీ, వాటన్నింటినీ ఐక్యంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ వేదిక తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ విశాల ఐక్య వేదికలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని పాలకులు ఓపీఎస్‌ పునరుద్ధరించడం సాధ్యం కాదనీ, దానివల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున భారం పడి ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని నర్సిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా మాట్లాడుతూ.. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, ఢిల్లీ, తదితర రాష్ట్రాల్లో ఓపీఎస్‌ అమలవుతున్నదన్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ అమలు కోసం పోరాటం తీవ్రం చేయాలన్నారు. పాత పెన్షన్‌ విధానం కార్మిక, ఉద్యోగ వర్గాలకే కాక దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఈ అంశం రాబోయే ఎన్నికలలో ప్రధాన ఎజెండాగా మారాలనీ, ప్రజల మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. అన్ని సంఘాలు సంయుక్తంగా పోరాడితేనే అది సాధ్యమవుతుందని నొక్కిచెప్పారు. 14 కోట్ల మందికి సామాజిక భద్రత కల్పించే సరైన వ్యవస్థ లేదనీ, జాతీయ సామాజిక భద్రత పేర వృద్ధులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం ద్వారా ఇచ్చే సహకారం చాలా మందికి కేవలం రూ.1000లోపే అందుతుండటం దారుణమన్నారు. కూరగాయలు, దినసరి సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇది అత్యంత కనిష్టమన్నారు. ఒక్కరోజులో 27 మీడియా ఛానళ్లను కొనుగోలు చేయగలిగే శక్తి కలిగి, 27 అంతస్తుల భారీ భవంతిలో సుఖాలు అనుభవిస్తున్న అంబానీ లాంటి శతకోటీశ్వరుల సంపదలో కేవలం ఒక్క శాతం పన్నులు ప్రభుత్వానికి సమర్పించినట్లయితే.. దేశంలోని ఉద్యోగ కార్మికులందరికీ పెన్షన్‌ సౌకర్యం సునాయాసంగా అందించవచ్చని తెలిపారు. అయినా నేటి కేంద్ర పాలకులు ఇలాంటి చర్యలకు పూనుకోరని శ్రీకాంత్‌ మిశ్రా ఎద్దేవా చేశారు.శంకర్‌రావు మాట్లాడుతూ..ఎన్పీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించే పార్టీలకే తమ ఓట్లు అని స్పష్టం చేశారు. ఉద్యోగి రిటైర్డయ్యే సమయంలో పొందే వేతనంలో 50 శాతాన్ని పెన్షన్‌గా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌దారుడు చనిపోతే పూర్తిస్థాయిలో భార్య, ఇతర కుటుంబ సభ్యులకు అందేలా చూడాలన్నారు. ఎన్‌పీఎస్‌పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదన్నారు. కమిటీలపై ఆశలు పెట్టుకోకుండా ఓపీఎస్‌ కోసం ఉద్యమం చేయడమే సరైందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి ఉదరుభాస్కర్‌, టీపీటీఎఫ్‌ అధ్యక్షుడు వై అశోక్‌ కుమార్‌, డీటీఎఫ్‌ అధ్యక్షుడు ఎం సోమయ్య, డీఆర్‌డీఓ హైదరాబాద్‌ ల్యాబ్స్‌ సీఓసీ(ఏఐడీఈఎఫ్‌ అనుబంధం) చైర్మెన్‌ శ్రీకాంత్‌ గౌడ్‌, టీఆర్‌టీఎఫ్‌ అధ్యక్షుడు కె అశోక్‌ కుమార్‌, జి తిరుపతి (ఎల్‌ఐసి), శ్రావణ్‌ కుమార్‌ (పోస్టల్‌), సతీష్‌ బాబు (రూరల్‌ బ్యాంక్స్‌), ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవికాంత్‌, బి కొండయ్య, షౌకత్‌ అలీ, కొప్పిశెట్టి సురేష్‌, యు.పోచయ్య, ఎన్‌ యాదగిరి, వై విజయకుమార్‌, టి లింగారెడ్డి, కె జంగయ్య, పి నాగిరెడ్డి, కె రమేష్‌, పి.యాదగిరి, కరుణాకర్‌గౌడ్‌, రజినీకాంత్‌, హరీశ్‌, మంగ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love