అప్సర హత్య కేసు..సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: నగరంలోని శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ఇవాళ నిందితుడు సాయికృష్ణను శంషాబాద్ మండలం నార్కుడ వద్ద హత్య చేసిన ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. హత్య జరిగిన తీరుపై పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి అప్సర మృతదేహాన్ని మ్యాన్ హోల్‌లో వేసిన ప్రాంతానికీ పోలీసులు నిందితుడిని తీసుకెళ్లారు. అప్సరతో సాయికృష్ణకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చింది. విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను సాయికృష్ణ హతమార్చాడు. మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో వేసి పూడ్చేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడే నిందితుడని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో.. రంగారెడ్డి జిల్లా కోర్టు సాయికృష్ణను కస్టడీకి అనుమతి ఇచ్చింది. గురువారం నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు.

Spread the love