స్టాండర్డ్‌ గ్లాస్‌లో ఆసాహీ రూ.200 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌ : గ్లాస్‌ లైన్డ్‌ ఎక్విప్‌మెంట్‌ రంగంలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీలో ఇంజనీర్డ్‌ గ్లాస్‌ సిస్టమ్స్‌ తయారీ కంపెనీ అసాహీ గ్లాస్‌ప్లాంట్‌ (ఎజిఐ జపాన్‌) రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీలో ఎజిఐ జపాన్‌, జిఎల్‌ హాకో, అనుబంధ కంపెనీలకు మైనారిటీ వాటా దక్కుతుంది. ఎజిఐతో పాటు ఆ సంస్థకు చెందిన కస్టమర్లు ఆశించే స్థాయిలో కఠిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రయివేటు లేబుల్‌ ఏర్పాట్లు, సహ-బ్రాండిం గ్‌, విడిభాగాల సరఫరాను ఈ భాగస్వామ్యంలో భాగంగా అమలు చేస్తారు. జీఎల్‌ హాకో ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్‌ చేయడంతో పాటు గ్లాస్‌-లైన్డ్‌ రియాక్టర్‌ల భద్రతను పెంపొందిస్తూ ఎస్‌ఈఎఫ్‌ గ్లాస్‌ టెక్నాలజీని రూపొందించాలని స్టాండర్డ్‌ గ్రూప్‌ లక్ష్యంగా చేసుకుందని.. జపనీస్‌ విపణిలోకి తమ సంస్థ ప్రవేశాన్ని ఎజిఐ జపాన్‌ సులభతరం చేస్తుందని స్టాండర్డ్‌ గ్రూప్‌ ఎండి నాగేశ్వర రావు కందుల తెలిపారు.
36 ఎకరాల్లో ప్లాంటు..
ఎజిఐ జపాన్‌ సిఇఒ యసుయుకి ఇకేడ 2023 మార్చి నుంచి స్టాండర్డ్‌ గ్లాస్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయంగా తమ సంస్థ విస్తరణకు ఇకేడ సాయపడుతున్నారని నాగేశ్వర రావు వెల్లడించారు. హైదరాబాద్‌ సమీపంలో 36 ఎకరాల్లో భారీ స్థాయిలో గ్లాస్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ ప్లాంటును స్టాండర్డ్‌ గ్లాస్‌ నిర్మిస్తోంది. వెల్డింగ్‌ రోబోలు, సెమీ ఆటోమేటెడ్‌ కట్టింగ్‌, బెండింగ్‌, వెల్డింగ్‌ మెషినరీ, అధునాతన వెల్డింగ్‌ పవర్‌ సోర్సెస్‌తో సహా అత్యాధునిక మెషినరీని నెలకొల్పుతున్నారు.