18న మంత్రివర్గ సమావేశం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 18వ తేదీ (గురువారం) జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. బుధవారం (17వ తేదీ) బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, పార్లమెంటరీపార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దిఉత్సవాల నిర్వహణపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. దానితో పాటే కర్నాటకలో కాంగ్రెస్‌పార్టీ విజయం, రాష్ట్రంలో ఆ ప్రభావం అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజే (18వ తేదీ) మంత్రివర్గ సమావేశాన్ని నూతన సచివాలయంలో ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు ప్రగతిభవన్‌లోనే ఈ సమావేశాలు జరిగాయి. సచివాలయంలో జరిగే తొలి మంత్రివర్గ సమావేశం ఇదే కావడం విశేషం. ఎన్నికల ఏడాది కావడంతో ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా దళితబంధు నిధుల విడుదల, నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ విధివిధానాల ఖరారు, అకాల వర్షాలతో జరిగిన పంటనష్టంపై రైతులకు ఆర్థిక సహాయం, పోడు రైతులకు పట్టాల పంపిణీ వంటి పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నట్టు సమాచారం.

Spread the love