ప్లాస్టిక్ డబ్బా మింగేసిన పాము..తొలగించిన వైద్యులు

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్లాస్టిక్ డబ్బాను మింగేసిన ఓ పాముకు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని తొలగించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంట్వాళ సమీపంలోని సాలుమరాడ తిమ్మక్క పార్కు సమీపంలోగల ఓ గుంతలో పాము గాయాలతో ఉండటాన్ని గమనించిన ఓ పాముల సంరక్షకుడు కిరణ్.. దానికి అక్కడే శస్త్ర చికిత్స చేశాడు. అనంతరం స్థానికంగా ఉన్న పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. పామును పరిశీలించిన డాక్టర్ యశశ్వి బృందం కడుపు ఉబ్బి ఉండటాన్ని గమనించి ఎక్స్ రే తీశారు. పాము కడుపులో ప్లాస్టిక్ పదార్థం ఉండటాన్ని గుర్తించారు. దీంతో వెంటనే శస్త్ర చికిత్స ద్వారా పాము పొట్టలోని ప్లాస్టిక్ డబ్బాను తొలగించారు. అనంతరం 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అది కోలుకున్న తర్వాత ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు డాక్టర్ యశశ్వి తెలిపారు.