పాటకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన కళాకారుడు గద్దర్‌ : సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ- హైదరాబాద్‌ : ప్రజాకళలకు, ఉద్యమాలకు గద్దర్‌ చేసిన సేవలు మరువలేనివి, తెలంగాణ పాటకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన కళాకారుడు గద్దర్‌ మృతి బాధాకరమని కేసీఆర్‌ అన్నారు. గద్దర్ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గద్దర్‌ సాధారణ బుర్రకథ కళాకారుడిగా జీవితం ప్రారంభించి..విప్లవ పంథాలో మమేకమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాటతో పల్లెపల్లెన తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపజేశారన్నారు. ఈ సందర్భంగా గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్‌(74) అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ 1949లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో దళిత కుటుంబంలోని లచ్చమ్మ, శేషయ్య దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1997 ఏప్రిల్‌ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినిమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయితే అవార్డును ఆయన తిరస్కరించారు. అయినప్పటికి ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడారు. గద్దర్‌ మృతిపట్ల పలువురు రాజకీయ, సాహితీ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Spread the love