మద్యం ప్రియులకు గుడ్ న్యూస్…

నవతెలంగాణ – చెన్నై
రాష్ట్రంలో మధ్యంను అధిక ధరకు విక్రయించడాన్ని అడ్డుకునేలా టాస్మాక్‌ దుకాణాల్లో కంప్యూటర్‌ బిల్లింగ్‌ విధానం అమల్లోకి రానుంది. మందుబాబులు క్యూఆర్‌ కోడ్‌, గూగుల్‌ పే ద్వారా నగదు చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో వున్న టాస్మాక్‌ మద్యం దుకాణాల్లో ఇటీవల తనిఖీలు నిర్వహించిన అధికారులు.. 1,967 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అవకతకవలను అడ్డుకునేందుకు తరచూ టాస్మాక్‌ అధికారులు.. తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే మందుబాబుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేలా పొరుగు రాష్ట్రమైన కేరళలో లాగే కంప్యూటర్‌ బిల్లింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు టాస్మాక్‌ సంస్థ నిర్ణయించింది. దీనికి సంబంధించి టాస్మాక్‌ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో 5 వేలకు పైగా టాస్మాక్‌ మద్యం దుకాణాలున్నాయని, ఈ దుకాణాలలో అవకతవకలు జరుగకుండా కంప్యూటర్‌ బిల్లింగ్‌ విధానాన్ని త్వరలోనే ప్రవేశపెడతామని తెలిపారు. మద్యం కొనుగోలు చేసేవారు తాము చెల్లించాల్సిన నగదును మొదటి కౌంటర్‌లో కంప్యూటర్‌ ద్వారా ఇచ్చే బిల్లును పొందవచ్చని, ఆ తరువాత రెండవ కౌంటర్‌లో ఆ బిల్లును చూపించి మద్యం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

Spread the love