లైంగికదాడి నేరాల చట్టాల్లో కీలక మార్పులు

నవతెలంగాణ – జర్మనీ
లైంగిక చర్యకు సమ్మతి తెలిపే విషయంలో కనీస వయసు వివిధ దేశాల్లో వేరుగా ఉంది. బ్రిటన్‌లో ఈ వయసు 16 ఏళ్లుగా ఉండగా, ఫ్రాన్స్‌లో 15 ఏళ్లు, జర్మనీ, చైనాల్లో 14 ఏళ్లుగా ఉంది. అయితే ఈ వయసు వారికంటే తక్కువ వయసు ఉన్న వాళ్లతో పరస్పర అంగీకారంతో లైంగిక చర్యకు పాల్పడినా అది లైంగికదాడి కిందికే వస్తుంది. లైంగిక ప్రయోజనాల కోసం.. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి డబ్బు ఆశచూపి బలవంతపెట్టినా, బెదిరింపులకు పాల్పడినా నేరమే. అందుకు జైలు శిక్ష కూడా పడుతుంది. అయితే, జపాన్‌లో ఇప్పటివరకు లైంగిక చర్యకు సమ్మతి కనీస వయసు 13 ఏళ్లుగా ఉంది. వీటికి సంబంధించిన నిబంధనల్లో 1907 నుంచి జపాన్‌ మార్పులు చేయలేదు. లైంగికదాడి నేరాలకు సంబంధించిన పలు చట్టాలకు 2017లో జపాన్‌ కొన్ని మార్పులు చేసింది. అయితే, ఆ మార్పులు నేర నియంత్రణకు సరిపోవంటూ అప్పట్లో జపాన్​వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అదే సమయంలో లైంగికదాడి కేసుల్లో విచారణ ఎదుర్కొని.. నిర్దోషులుగా బయటపడ్డ వందల మంది ర్యాలీలు చేపట్టారు. ఇక, వీరిని వ్యతిరేకిస్తూ లైంగిక దాడులకు గురైన అనేక మంది బాధితులు, వారి మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అలా లైంగికదాడి నేరాలకు సంబంధించిన చట్టాల్లో అవసరమైన మార్పులు తేవాలనే డిమాండ్‌ ఎక్కువగా వినిపించింది. దీంతో జపాన్‌ ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ దేశ మానవ హక్కుల సంఘాలు స్వాగతించాయి. భారతదేశంలో లైంగిక చర్యకు సమ్మతి తెలిపే వయసు పోక్సో చట్టం, 2012 ప్రకారం 18 ఏళ్లుగా ఉంది. పరస్పర అంగీకారంతో లైంగిక చర్యకు పాల్పడినా అది అత్యాచారం కిందకే వస్తుంది. అయితే, ఈ విషయంలో సమ్మతి వయసు వివిధ చట్టాల ద్వారా పెరుగుతూ వచ్చింది. 1940 నుంచి 2012 వరకు 16 ఏళ్లుగా ఉంది.

Spread the love