కూట్లె రాయి తియ్యనోడు ఏట్లె రాయి తీస్తడట

జానపదుల తాత్విక చాలా గొప్పగా వుంటది. ఒక్క వాక్యంలోనే ఒక ఫిలాసఫి చెప్పుతరు. చిన్నచిన్నగ చేయాల్సిన పనులు చెయ్యలేనోడు పెద్ద పెద్ద పనులు చేస్తానని ఎచ్చులు చెప్పుతుంటరు కొంతమంది. అసొంటోల్లను వీడు ‘కూట్లె రాయి తియ్యనోడు ఏట్లె రాయి తీస్తడట’ అని అంటరు. కూట్లె రాయి అంటే కూటిలో. కూడులో తినే అన్నంలో రాయి అన్నట్లు. అన్నం తింటుంటే రాయి దొరక పట్టలేని వాడు ఏట్లె అంటె ఏరులో (నదిలో) అన్నట్లు. పారే నదిలోంచి రాయి తెస్తడా అన్నట్టు. అంటే కొందరు ‘కాళ్లు గడపలు దాటయి గని మాటలు కోటలు దాటుతయట’ అన్నట్టు వుంటది. వాడు ఇంట్ల కెల్లి కాళ్లు గడప బయట పెట్టలేడు గానీ మాటలైతే కోట గోడలు దాటినట్టు మాట్లాడుతడు. అయితే అసొంటోల్లకు ‘మంత్రాల బలం లేకున్నా తుంపిర్ల బలం’ ఉన్నది అనుకుంటరు.
దీనినే ఆడవాల్ల కోసం ఇంకో రకంగా చెప్పుతరు. ‘ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట’ అంటరు. ఉట్టి అంటే ఈతరం వాల్లకు తెల్వగపోవచ్చు. పాలు, పెరుగు ముంతల్లో పెట్టేందుకు ఉట్టి అంటే దూలానికి వేలాడదీసినట్టు వుండే తాళ్లతో చేసిన వస్తువు. అక్కడ పాలు గానీ పెరుగు గానీ పెడితే పిల్లి ముట్టదు. అయితే అది ఎత్తులో వుంటది. అందుకే ‘ఉట్టికి ఎగురలేనమ్మ ఇక స్వర్గానికి ఏం ఎగురుతద’ని. స్వర్గం ఎక్కడుంటదో ఎవలకు తెల్వది గని అది పైన ఆకాశంలో వుంటదనే ఊహ. సామెతలు, జాతీయాలు చెప్పితే ఆ మనిషి తత్వం మొత్తం చెప్పినట్లే వుంటది. మరింత వివరణ అవసరం వుండది.
మరి కొందరు జాము మనుషులు ఉంటరు. జాము అంటే జర సోమరితనం. ఏ.. చెయ్యి చెయ్యరా అంటే నెమ్మదిగా పని చేస్తరు. పని పూర్తి కానియ్యరు. చేసిందే చేస్తరు. వాల్లను వీడు ‘దున్నంగ పోయి దులపంగ వస్తడు’ అంటరు. అంటే వరినాట్లు వేసేందుకు నాగలి దున్నేటప్పుడు ఏదో ఒక పనికి పోయి తొందరగా రాడు. ఎప్పుడు వస్తాడంటే. దులుపంగ వస్తడు. ఏం దులుపంగ అంటే ఆ దున్నిన మడిలో నాట్లు వేసి, చేను పెరిగి వరి కోత కోసి, వడ్లు దులిపేటప్పుడు. అంటే మూడు నెలల వరకు వస్తడు అన్నట్లు. ఇట్లా సూక్ష్మంగానే మొత్తం చెప్పుతరు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love