మణిపుర్‌ ఆందోళనలతో అట్టుడికిన పార్లమెంట్‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను మణిపుర్‌ అంశం అట్టుడికిస్తోంది. మణిపుర్‌లో అల్లర్లు, తాజాగా వెలుగులోకి వచ్చిన మహిళపై అమానుషం ఘటనపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలకు దిగాయి. ఈ అంశంపై చర్చకు విపక్షాలు సహకరించాలని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ప్రధాని మోడీ సభలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో క్షణాల వ్యవధిలోనే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలోనూ మణిపుర్‌ అంశంపై చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సభా కార్యకలాపాలు రద్దు చేసి దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని కోరాయి. అయితే దీనిపై స్వల్పకాలిక చర్చకు తాము సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విపక్షాలు అంగీకరించలేదు. ప్రతిపక్ష సభ్యులు సంయమనం పాటించాలని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ కోరినా వారు శాంతించలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు.