రాజస్థాన్‌లో దారుణం..బాలికపై సామూహిక లైంగిక దాడి, హత్య

నవతెలంగాణ -రాజస్థాన్‌: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. బికనీర్ లోని ఖజువాలాలో కోచింగ్‌ తీసుకుంటున్న దళిత బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మంగళవారం ఉదయం కొత్త ధన్మండి రహదారిపై బాలిక మృతదేహం పడి ఉంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందడంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో ఉంచి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాతే.. పోస్టుమార్టం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రిలో చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత బంధువులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం కూడా అక్కడికి చేరుకుని.. బాలిక కుటుంబ సభ్యులను ఒప్పించారు. దీంతో మహిళా డాక్టర్ సమక్షంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితులుగా గుర్తించారు. మనోజ్ కుమార్, భగీరథ్‌ అనే ఇద్దరిని సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తేజస్వని గౌతమ్ ఆదేశించారు. అంతకుముందు, పోలీసు సూపరింటెండెంట్‌ను కలవడానికి మాజీ పార్లమెంటరీ సెక్రటరీ డాక్టర్ విశ్వనాథ్ మేఘవాల్ ప్రయత్నించారు. ఆయన వారి బృందంతో కలిసి పోలీసు స్టేషన్‌కు చేరుకుని న్యాయమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Spread the love