ప్రమాద ఘటన బాధ్యులపై కఠిన చర్యలు: ప్రధాని మోడీ

నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశా మూడు రైళ్ళ ప్రమాద సంఘటన స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ప్రమాదంలోని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాఫ్తుకు ఆదేశించామని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. ఇది దురదృష్టకర సంఘటన అని, దీనిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. గాయపడిన వారికి ఎలాంటి చికిత్స అవసరమైనా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మోడీ గాయపడిన కొంతమంది ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దోషులుగా తేలిన వారికి కఠినంగా శిక్షిస్తామన్నారు. గాయపడిన వారిని కలిసినట్లు మోడీ చెప్పారు. ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే కసరత్తు చేస్తోందన్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్‌లో మూడు వేర్వేరు ట్రాక్‌లపై బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి గురయ్యాయి. ఒడిశా ప్రభుత్వ స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ప్రకారం రెండు రైళ్లకు చెందిన 17 కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Spread the love