ఇంజినీర్ చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే..వీడియో వైరల్

నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే అందరి ముందు ఓ ఇంజినీరును దూషించడమే కాకుండా చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థానే జిల్లా మీరా భయందర్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు. వీటి కూల్చివేతతో వర్షంలో చిన్నారులు, వృద్ధులు రోడ్డున పడ్డారంటూ మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ ఇద్దరు ఇంజినీర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న జూనియర్ సివిల్ ఇంజినీర్ శుభమ్ పాటిల్‌పై చేయిచేసుకున్నారు. కాషిమిరాలోని పెంకర్‌పడా ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను శుభమ్ పాటిల్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈ నెల 16న జరిగిందీ ఘటన. వర్షం కురుస్తున్నప్పుడే కూల్చివేతలు చేపట్టడంతో ఓ ఆరు నెలల చిన్నారి, వృద్ధులు నిలువ నీడ లేకుండా వర్షంలో తడిసి ముద్దయ్యారు. సమాచారం అందుకున్న గీతా జైన్ అక్కడకు చేరుకుని ఇంజినీర్లు శుభమ్ పాటిల్, సోనీతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో శుభమ్‌పై చేయి చేసుకున్నారు. వీడియో వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆక్రమణల కూల్చివేతలో వారి తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే గీతా జైన్ తన చర్యను సమర్థించుకున్నారు. గీతా జైన్‌ గతంలో బీజేపీ నుంచి మేయర్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు.

Spread the love