భర్త మరణించిన నాలుగు గంటల్లోనే భార్య…

నవతెలంగాణ – నెల్లూరు
వారిద్దరూ భార్యభర్తలు.. ఒకరికొకరుగా జీవించారు. అనారోగ్యం వారిని వెంటాడింది… భర్త మృతిచెందిన నాలుగు గంటల వ్యవధిలోనే భార్య తనువు చాలించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరైన హృదయ విదారక ఘటన ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో బుధవారం జరిగింది. నరుకూరులో రమణ (40), సుమలత (36) దంపతులు జీవిస్తున్నారు. డ్యాన్సర్‌గా రమణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్థానికుల మన్ననలు పొందారు. కొద్ది రోజుల క్రితం దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. వారం రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నై తరలించారు. భర్త చికిత్స పొందుతున్న సమయంలో సుమలత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం రమణను చెన్నై నుంచి నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. నరుకూరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహించిన నాలుగు గంటల వ్యవధిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమలత మరణించింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love