చర్మ సంరక్షణకు ఇవి అవసరం…

వయసు మీదపడేకొద్దీ ముఖంలో మార్పులు రావడం సహజం. ముఖ్యంగా ఈ సమస్యను మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. 35 ఏండ్లు దాటగానే ముఖ చర్మంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖంపై ముడతలు కనిపించడం, చర్మం వదులు కావడం, నిగారింపు తగ్గిపోవడం, నల్లగా మారిపోవడం లాంటివి కనిపిస్తుంటాయి. ఈ సమస్యలు వేసవి కాలంలో ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో ముఖం పొడిబారిపోయినట్టుగా ఉంటుంది. వీటి నుంచి పరిష్కారం పొందాలంటే చిన్నపాటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే చాలంటున్నారు బ్యూటీషియన్లు. ఎ వాతావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం ఉత్తమమని చెపుతున్నారు. అలా కాకుండా మరీ వేడి నీటితో స్నానం చేస్తే చర్మం త్వరగా సాగిపోయి ముడతలు పడే అకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.ఎ ప్రతి రోజూ మజ్జిగలో కాస్తంత జీలకర్ర వేసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే చర్మానికి మేలు చేస్తుందని చెపుతున్నారు. మంచినీటిలో వట్టివేర్లను వేసుకుని తాగాలి. ఈ నీరు శరీరానికే కాకుండా చర్మానికి కూడా మంచిదేనంటున్నారు. వీటితో పాటు.. బార్లీ, ఓట్స్‌లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందన్నారు.ఎ సజ్జ రొట్టెలు, రాగిజావలను వారానికి కనీసం నాలుగు సార్లు, అలాగే సొరకాయ, బీర, పొట్లకాయ, గుమ్మడి, కీరదోస.. లాంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతగానో తోడ్పడతాయని చెపుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిద్రను నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు.