అభాగ్య విధాత బడ్జెట్టు

మనవి భాగ్యవిధాత బడ్జెట్టు కాదు
విధాత వరప్రసాద అభాగ్య బడ్జెట్టే
కేటాయింపుల గణితం
కల్పిత బ్రహ్మ రాసే రాత అర్థమైతదేమో కానీ
శిల్పంలా చెక్కిన మన ప్రజాస్వామ్య బడ్జెట్టు అర్థంకాదు
కొత్త ఆర్థిక స్వభావ నిఘంటువును వెతకాల్సిందే
సంపన్నుల సంపదకు రాయితీలు
ప్రజలకు శఠగోపం పెట్టే వరాలు
పేదలకు మొట్టికాయలు
శ్రమకార్చిన చెమట చుక్కలకు
మండుటెండ రాయితీ
ఉండలేక ఊగులాడుతూ
ఉట్టెక్కిస్తున్నామనే
సూక్తి ముక్తావళి ముక్తిపోటు
బతుకు వెలుగులకు సమాధి కట్టే
విద్యుత్తు వినియోగ ఛార్జీల వాత
విద్యకు కేటాయింపులు హళ్ళికి హళ్ళి సున్నకు సున్న
ప్యాకేజీ కాగితాలకే పరిమితం
ఉద్యోగాల భర్తీ ఊసులేని ఖజానా
నిరుద్యోగ భూతానికి స్వేచ్ఛావిహార పర్మిషన్‌
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున ఉరికెన్‌
సమస్యకు పూరణలేని ధారణ
మనప్రజాస్వామ్య బడ్జెట్టు
కాగితాల మీదనే కేటాయింపుల మ్యాజిక్కు
ఆచరణలో జీరో ఖాతాలు
ప్రజా బడ్జెట్టు బ్రహ్మాండం
ప్రజలకు పస్తుల సిస్తుల బహుమానం
భళా అభాగ్య విధాత బడ్జెట్టూ! భళా! భళా!
– వల్లభాపురం జనార్థన,
9440163687

Spread the love