నిర్వాసిత

ఒక దు:ఖపునేల మీంచి వస్తున్నాను
బతుకుపోరులో ఓడిపోయీ ..
అడవిలో ఆకుల్లా రాలిపోయిన
పురా జ్ఞాపకాల ఆదివాసీగూడల్లోంచి వస్తున్నాను
డిండీ జలకోర
గూడేల్నీ .. గూడేల్లోని బతుకుల్నీ మింగేసాక ..
మనుషుల ఆనవాళ్లులేని
మరుభూముల్లోంచి వస్తున్నాను!

దు:ఖం పూడుకుపోయిన గూడల్లో
ఆరని కన్నీటితడిని ఒత్తుకుంటూ వస్తున్నాను
పునరావాసం కల్పిస్తామనీ ..
నీటిమీద మాటలతో నమ్మించిన రాజ్యం
నట్టడవిలో లీజు పట్టాలిచ్చినట్టే యిచ్చీ ..
నియంత్రిత అటవీచట్టాల నిప్పులు పోసీ ..
పుట్టి పెరిగి ఎత్తరిల్లిన తరాల నేలమీంచి
ఆదివాసీ బిడ్డల్ని తరిమిగొడుతున్న
ఒక దుర్భర సందర్భంలోంచి వస్తున్నాను!

అమృతోత్సవాల వేళ ..
ఒక అరణ్య రోదనలోంచి వస్తున్నాను
అరవైయేళ్ల వనవాసం ముగిసినా
వెలుతురు ఛాయలు కనిపించని
చీకటి ‘కండ్లకుంట’ కన్నీళ్లను
చేదుకుంటూ వస్తున్నాను
నోటికాడ మెతుకునూ
మట్టిమీద బతుకునూ కోల్పోయీ ..
కన్నీళ్లమీంచి కాలాన్ని దాటుతున్న
ఒక నిర్వాసిత నేలమీంచి వస్తున్నాను!

చెట్టూ పుట్టా పిట్టా పులుగూ గొడ్డూ గోదా
సమస్త పాశాలు జలసమాధయ్యేక ..
అనేకానేక శిశిర గీతాల్ని
బృందగానాలుగా పాడుకుంటున్న గోధూళివేళల్నీ
తలకెత్తుకుంటూ వస్తున్నాను
కూలిచేస్తే గానీ.. కుండాడని బతుకులన్నీ
అడవితో అంటుకట్టుకున్న బంధాలను ..
మట్టితో పెనవేసుకున్న
తరాల రుణానుబంధాల్ని తెంచుకొని..
ఊరునీ .. ఉనికినీ కోల్పోయిన
ఒకానొక వలసద:ఖంలోంచి వస్తున్నాను !

రేపటి పోరాటానికి..
తూరుపు తురాయిపూల వనంలో దాచిన
విల్లమ్ములు వాళ్లకందించే వస్తున్నాను !!
(డిండీ ప్రాజక్ట్‌ నిర్వాసితులకు..)
– సిరికి స్వామినాయుడు, 94940 10330

Spread the love