16 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య

నవతెలంగాణ-అడిక్‌మెట్‌
కేంద్ర ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలనీ, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలనీ, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డి మాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షు లు డాక్టర్‌ ఎన్‌.మారేష్‌ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహావిష్కరణ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఇది ప్రజస్వామ్య దేశం అనీ, అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలన్నా రు. అప్పుడు దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుదన్నారు. అందుకు బీసీలకు రావాల్సిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరగాలన్నారు. బీసీలకు రాజ్యాంగ బద్దమైన హక్కులు-వాటా కల్పించాల్సిన సమయం ఆసన్నమైనదన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలనీ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలనీ, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, భూపేష్‌ సాగర్‌, టి.రాజ్‌ కుమార్‌, నందగోపాల్‌ పాల్గొన్నారు.

Spread the love