దసరాకు వస్తా..భవనం ప్రారంభిస్తా

– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
– అప్పటి వరకు పాఠశాల భవనం పూర్తి చేయాలి
– రూ.49లక్షలతో అదనపు తరగతి గదులు
– ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
– ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు మంచి భవిష్యత్‌
– చెర్లపటేల్‌గూడ, కప్పాడులో అభివృద్ధి పనులు ప్రారంభం
– ఘనంగా విద్యా దినోత్సవం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
దసరాకు మళ్ళీ వస్తా, పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తానని అప్పటి వరకు భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అధికారులు ఆదేశించారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని చర్లపటేల్‌గూడ, కప్పాడు గ్రామాల్లో పర్యటించారు. కప్పాడులో గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు ప్రారంభించారు. చర్లపటేల్‌గూడలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ చర్లపటేల్‌గూడ నిర్మాణ పనులను దసరా నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు ఆదేశించారు. మళ్ళీ వస్తా దసరా రోజు భవనాన్ని ప్రారంభిస్తారని గుర్తు చేశారు. ఈ లోగ పనులు పూర్తి చేసి అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నాయని చెప్పారు. సకల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మనఊరు..మనబడి కార్యక్రమాల ద్వారా పాఠశాలలు కొత్త రూపు దిద్దుకుంటున్నాయని చెప్పారు. చెర్లపటేల్‌గూడకు అదనంగా ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై సర్దుబాటు చేయాలని మండల విద్యాధికారిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ రెండు గ్రామాల్లో సుమారు రూ.80లక్షలలకుపైగా నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభోత్సవాలు చేసుకున్నామని చెప్పారు. ఇదే తరుణంలో చర్లపటేల్‌గూడా, కప్పాడు గ్రామాల మీదుగా 16 కిలోమీటర్ల మేర రోడ్డు డబుల్‌ రోడ్డుగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ తరుణంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డుగా ఉన్న ఇండ్ల ప్రహరీ గోడలను తొలగించాల్సి వస్తుందని అందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. పంచాయతీ రాజ్‌ కింద ఉన్న ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదిలీ చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. గ్రామపంచాయతీల రూప రేఖలు మారిపోయాయన్నారు. ఈ సందర్భంగా కప్పాడు సర్పంచ్‌ సామల హంసమ్మని కార్యాలయంలోని కుర్చీలో కూర్చోపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ పి.కృపేష్‌, జడ్పీటీసీ భూపతిగళ్ల మహిపాల్‌, వైస్‌ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచులు కంబాలపల్లి గీతారాంరెడ్డి, సామల హంసమ్మ, ఎంపీటీసీలు అంజనేయులు, భరత్‌రెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, ఉపసర్పంచ్‌లు నరేందర్‌, ఎండీ మునీర్‌, మండల స్థాయి అధికారులున్నారు.

Spread the love