లెదర్‌ వస్తువులను కాపాడుకోండిలా…

లెదర్‌ అంటే ఇష్టపడని వారుండరు… బ్యాగ్స్‌, జాకెట్స్‌, షూస్‌ ఇలా… చాలా రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించేప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అయితే వర్షాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి పాడైపోతాయి. ఎక్కువ ధర పెట్టి కొన్న లెదర్‌ వస్తువులు పాడైపోతే చాలా బాధగా ఉంటుంది. వర్షాకాలంలో ఏ సమయంలో వాన పడుతుందో తెలియదు. కాబట్టి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని పాడవకుండా కాపాడుకోవచ్చు.

పాలిష్‌ : లెదర్‌ జాకెట్‌, లెదర్‌ షూస్‌ ధరించాలనుకున్నా లేదా లెదర్‌ బ్యాగ్‌ వెంట తీసుకెళ్లాలనుకున్నా దానికి కాస్త పాలిష్‌ చేయడం మంచిది. దీని కోసం వెజిటబుల్‌ ఆయిల్‌ లేదా వ్యాక్స్‌తో తయారైన పాలిష్‌ ఉపయోగించాలి. ఇది లెదర్‌ బ్యాగ్‌ను మెరిసేలా చేస్తుంది. అలాగే వాన నీరు బ్యాగ్‌పై నిలవకుండా చేస్తుంది. దాంతో బ్యాగ్‌ పాడవకుండా ఉంటుంది.
పూర్తిగా ఆరేలా : లెదర్‌ వస్తువులు తడిచినప్పుడు వాటిని వీలైనంత త్వరగా ఆరేలా చూసుకోవాలి. లేదంటే దాని మీద ఫంగస్‌ పెరిగి పాడైపోతాయి. బ్యాగ్‌ పైన ఆరితే సరిపోదు. లోపల కూడా తడి లేకుండా చూసుకోవాలి. కాబట్టి బ్యాగ్‌ లోపల న్యూస్‌ పేపర్లు పెట్టి బ్యాగును ఫ్యాను కింద ఉంచితే లోపల, బయట పూర్తిగా డ్రైగా మారిపోతుంది.
దుమ్ము చేరకుండా : వర్షాకాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. మనం ఉపయోగించే వస్తువులు సైతం కాస్త చెమ్మగా ఉన్నట్టనిపిస్తాయి. ఈ తడికి దుమ్ము, ధూళి తోడైతే లెదర్‌ బ్యాగులు చాలా త్వరగా పాడయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి వర్షాకాలంలో లెదర్‌ వస్తువులు తీసుకుని బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేయడం మరచిపోవద్దు. వర్షం కురిసినా, కురవకపోయినా మెత్తటి బ్రష్‌ లేదా వస్త్రంతో బ్యాగ్‌ను తుడిచి పెట్టుకోండి.
వేడికి దూరంగా : త్వరగా ఆరిపోతాయి కదా.. అని లెదర్‌ వస్తువులను ఎండలో మాత్రం ఆరేయద్దు. ఇలా చేయడం వల్ల అవి ఆరడం ఎలా ఉన్నప్పటికీ పూర్తిగా నాశనమైపోతాయి. ఎండలోనే కాదు హీటర్‌, బ్లోడ్రయర్‌ లేదా ఐరన్‌ బాక్స్‌ వంటివి ఉపయోగించి కూడా ఆరబెట్టడానికి ప్రయత్నించవద్దు. వీటి వల్ల అవి నిర్జీవంగా మారిపోతాయి. అంతేకాదు ఈ వస్తువుల మన్నిక కాలం తగ్గిపోయేలా చేస్తాయి.

Spread the love