చిత్రవధ చేసి చంపారు గో రక్షకుల అరాచకం

– అన్సారీ మృతదేహంపై అనేక గాయాలు
నాసిక్‌ : గో రక్షకుల దాడిలో చనిపోయిన అఫాన్‌ అబ్దుల్‌ అన్సారీ మృత దేహాన్ని చూసిన వారి హృదయం ద్రవిస్తోంది. ఆయనను చిత్రహింసలు పెట్టి చంపారని అర్థమైపో తోంది. దాడిలో అన్సారీ ముక్కు పగిలిపోయింది. నుదుటిపై పెద్ద గాయం కన్పిస్తోంది. ఆయన చేతి వేళ్లు వెనక్కి మెలితిప్పి ఉన్నాయి. చేతిపై కూడా గాయాలు ఉన్నాయి. చెవులపై ఏదో ఒక ఆయుధంతో కొట్టినట్లు కన్పించింది. మొత్తంమీద ఆయన శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. అయితే పోస్ట్‌మార్టం నివేదిక మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. పొత్తికడుపు పైన, తల పైన అయిన గాయాల కారణంగా అధిక రక్తస్రావం జరిగి చనిపో యాడని ఆ నివేదికలో తెలిపారు. ముంబయికి చెందిన 32 సంవత్స రాల అన్సారీ ఇద్దరు ఆడపిల్లల తండ్రి. మహారాష్ట్రలోని నాసిక్‌లో కారులో మాంసాన్ని రవాణా చేస్తుండగా గో సంరక్షకులు అతనిపై దాడి చేసి చంపారు. అతనితో పాటు ప్రయాణి స్తున్న స్నేహితుడు నాసిర్‌ ఖురేషీపై కూడా దాడి జరిగింది. అతను ఇప్పుడు చావుబతు కుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమే మంటే చట్ట విరుద్ధంగా జంతువును చంపారన్న అభియో గంపై అన్సారీ, ఖురేషీలపై పోలీసులు కేసు పెట్టారు. అది ఏ జంతువో తెలుసుకునేందుకు మాంసాన్ని ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపారు. మహారాష్ట్రలో ఆవులతో పాటు ఎడ్లను చంపడంపై కూడా నిషేధం అమలులో ఉంది. ఇది హిందూ గో రక్షకులు తమపై దాడి చేయడాన్ని ప్రోత్సహిస్తోందని మాంసం వ్యాపారులు, రవాణా దారులు అంటున్నారు. మాంసాన్ని ముక్కలుగా చేసిన తర్వాత అది ఏ జంతువుదో తెలుసుకోవడం కష్టమని వారు చెప్పారు. నాసిక్‌ ప్రాంతంలో గత పది హేను రోజులలో ఇలాంటి సంఘటన జరగడం రెండోసారి. ఇలాంటి దాడు లు జరిగినప్పుడు తమను ఎవరూ కాపాడడం లేదని రవాణా సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఆసియాలోనే అతిపెద్ద పశు వధశాలకు చెందిన షాహిద్‌ షేక్‌ వాపోయారు. మాంసా న్ని రవాణా చేయాలంటే డ్రైవర్లు భయ పడుతున్నారని ఆయన అన్నారు.
మెరుగైన ఆదాయం కోసం వచ్చి…
అన్సారీ విషయానికి వస్తే నాలుగు నెలల క్రితం వరకూ ఆయన ముంబయిలో ఎయిర్‌ కండిషనర్లను మరమ్మతు చేస్తుండేవాడు. ఆ తర్వాత మెరుగైన ఆదాయం కోసం మాంసం రవాణా చేయడం ప్రారంభించాడు. సంఘటన జరిగిన 24వ తేదీన అతనికి ఓ ఆర్డర్‌ వచ్చింది. అహ్మద్‌ నగర్‌ జిల్లాలోని సంగమ్‌నేర్‌ నగరం నుండి ముంబయికి మాంసాన్ని రవా ణా చేయాలని అడిగారు. ఇందుకు అంగీకరించిన అన్సారీ తన స్నేహితు డైన ఖురేషీని వెంట తీసుకొని వెళ్లాడు. కారు టోల్‌ప్లాజా వద్దకు రాగానే కొందరు వ్యక్తులు అటకాయించారు. భయంతో కారును వేగంగా నడుపు తుండగా కార్లు, మోటారు సైకిళ్ల మీద వెంటపడ్డారు. చివరికి వారిద్ద రినీ కారు నుండి కిందికి లాగి మరో కారులో ఎక్కిం చుకొని సమీపంలోని అడవిలోకి తీసికెళ్లారు. అక్కడ వారిని చెట్టుకు కట్టేసి రెండున్నర గంటల పాటు తీవ్రంగా హింసించారు. ఈ దారుణ ఘటనలో అ న్సారీ చెంపల ఎముకలు బాగా నలిగిపోయాయి. బూట్లతో అనేక సార్లు అన్సారీ ముఖంపై కొట్టినట్లు అతని శవాన్ని చూసిన వారికి అర్థమవు తోంది. చిత్ర హింసల అనంతరం వారిద్దరినీ తాళ్లతో కట్టేసి కారు లో వదిలేశారు. ఆ తర్వాత అన్సారీ కుటుంబ సభ్యు లకు విషయం తెలిసి అక్కడికి వచ్చేసరికే అతను చనిపోయాడు.
టోల్‌ప్లాజాల వద్ద మాటు వేసి…
మాంసాన్ని రవాణా చేస్తున్న సమాచారం అందుకుంటున్న గో రక్షకులు టోల్‌ప్లాజాల వద్ద మాటు వేస్తున్నారు. టోల్‌ ఫీజును చెల్లించ డానికి వాహనం ఆగగానే వారు తనిఖీలు చేస్తున్నారు. స్థానికులకు వాట్సప్‌ సందేశాలు పంపుతున్నారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని దాడులు చేస్తున్నారు. సరైన పత్రాలు ఉన్నప్పటికీ డ్రైవర్లను కొట్టడం సర్వ సాధారణమై పోయింది. ఒకవేళ అది నిషిద్ధ మాంసమే అయితే పోలీసులు చర్య తీసుకోవచ్చని, కానీ వారి పని గో రక్షకులే చేస్తున్నారని మాంసం రవాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love