ఉత్త‌రాదిని మ‌ళ్లీ వ‌ణికిస్తున్న వ‌ర‌ద‌

yamuna-Riverనవతెలంగాణ – న్యూఢిల్లీ: వ‌ర‌ద ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్త‌రాదిని మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. హిమాచ‌ల్, ఉత్త‌రాఖండ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో రెయిన్ అల‌ర్ట్ జారీ చేయ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక పోటెత్తిన వ‌ర‌ద‌తో ప్ర‌మాద‌స్ధాయిని మించి ప్ర‌వ‌హించిన య‌మునా న‌దిలో నీటి ప్ర‌వాహం ఇటీవ‌ల కొద్దిగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో వ‌ర్షాల‌తో య‌మునా న‌ది మ‌ళ్లీ 205.48 మీట‌ర్ల నీటి ప్ర‌వాహానికి చేరుకుని ప్ర‌మాద స్ధాయిని మించి ఉప్పొంగుతోంది. గ‌త‌వారం భారీ వ‌ర్షాల‌తో పాటు హ‌రియాణ‌లోని హ‌థిన్‌కుంద్ బ్యారేజ్ నుంచి నీటిని విడుద‌ల చేయ‌డంతో య‌మునా న‌ది ఏకంగా 205.33 మీట‌ర్ల ప్ర‌మాద‌స్ధాయిని మించి ప్ర‌వ‌హించింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అధికారులు ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డంతో పాటు స‌హాయ పునారావ‌స శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు వ‌ర‌ద ముప్పుతో కంటిమీద కునుకు క‌రువైన ఢిల్లీ వాసులు మ‌రోసారి ఉలిక్కిప‌డ్డారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో వ‌ర్షాలు కొన‌సాగుతుండ‌టం, రెయిన్ అల‌ర్ట్స్ జారీ చేయ‌డంతో ఉత్త‌రాదిని వ‌ర‌ద వ‌ణికిస్తోంది. ఈ నెల ఆరంభంలో కుండ‌పోత‌తో వ‌ర‌ద పోటెత్త‌డంతో ఉత్త‌రాదిలోని ప‌లు రాష్ట్రాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. పొంగి పొర్లుతున్న న‌దుల‌తో బ్రిడ్జిలు కొట్టుకుపోవ‌డంతో పాటు వాహ‌నాలు సైతం నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. రోడ్లు, విద్యుత్ వ్య‌వ‌స్ధ స‌హా మౌలిక వ‌స‌తులు దెబ్బ‌తిన్నాయి. వంద మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది రూపాయ‌ల ఆస్తి న‌ష్టం వాటిల్లింది.