క‌ల‌క‌లం రేపుతున్న నీట్ విద్యార్థుల వ‌రుస ఆత్మ‌హ‌త్య‌లు

నవతెలంగాణ – రాజస్థాన్
రాజస్థాన్‌లోని కోట పట్టణంలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా 2 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉదయపూర్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. చనిపోయిన విద్యార్థి మెహుల్ వైష్ణవ్‌గా పోలీసులు గుర్తించారు. ఉదయ్‌పూర్ జిల్లాలోని సలుంబర్‌ నివాసి అయిన వైష్ణవ్.. రెండు నెలలుగా ఓ కోచింగ్ సెంటర్లో నీట్ (NEET) పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం విజ్ఞాన్ నగర్‌లో ఉన్న హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ ఘటన జరిగిన రోజు తన రూమ్‌మేట్ బయటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం రూంలో ఒంటరిగా ఉన్న వైష్ణవ్.. గంటలు గడిచినా బయటికి రాకపోవడంతో అతని హాస్టల్‌మేట్స్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వార్డెన్ వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా వైష్ణవ్ ఉరివేసుకుని కనిపించాడు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒత్తిడి కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆదిత్య అనే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతడు రెండు నెలల కిందటే నీట్‌ కోచింగ్‌ నిమిత్తం కోటకు వచ్చాడు. విజ్ఞాన్‌ నగర్‌లోనే మరో హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌ తీసుకున్నాడు. అయితే మంగళవారం ఆదిత్య తన గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బిహార్‌కు చెందిన మరో 17 ఏళ్ల విద్యార్థి కూడా మంగళవారం ఆత్మహత్యకు యత్నించగా.. చివరినిమిషంలో అతడ్ని కాపాడగలిగారు. ఈ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చనిపోవాలనుకున్నట్లు చెప్పాడు. దీంతో వారు వెంటనే కోటలోని చైల్డ్‌లైన్‌కు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. వారు అప్రమత్తమై హాస్టల్‌కు చేరుకుని ఆ విద్యార్థిని కాపాడారు. కాగా వీరిద్దరితో కలిపి కోటాలో గత 2 నెలల వ్యవధిలోనే 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మే నెలలో ఐదు మంది, జూన్‌లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యలకు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. చదువులో ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు కోట ప్రసిద్ధి చెందింది. కేవలం రాజస్థాన్‌ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి కోచింగ్‌ తీసుకుంటారు. అయితే గత కొన్ని రోజులుగా విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో కోట పట్టణం తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఈ సంఖ్య 14కు చేరడం విచారకరం. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు మరణాల వెనుక కారణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చదువుపై ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా లేదా అనే దానిపై ఇనిస్టిట్యూట్ అధికారుల నుంచి వారికి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.

Spread the love