వజ్ర సంకల్ప వరలక్ష్మి

విజయం ఏ ఒక్కరి సొత్తూ కాదు. అలా అని అది సాధించడం అంత సులువైన పనీ కాదు. విజయం మన దరి చేరాలంటే కష్టపడాల్సిందే. అలా కష్టపడుతూ స్వశక్తిని నమ్ముకొని అంచలంచలుగా ఎదిగిన మహిళా మణులు ఎందరో మన జీవనయానంలో తారసపడుతుంటారు. అలాంటి వారిలో వరలక్ష్మి ఒకరు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ, అనేక ఆకృతులతో తినుబండారాలు తయారు చేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు కలపకుండా, ప్రెజర్వేటివ్స్‌ లేకుండా అంజీర్‌ పండ్లతో జామ్‌, చిప్స్‌తో పాటు అనేక రకాల పొడులు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. అంతే కాకుండా పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఫ్రూట్‌ ఫుల్‌ అనే ఆహార ఉత్పత్తుల సంస్థను స్థాపించి ప్రగతి పథంలో దూసుకెళుతున్నారు. ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం….
నారాయణపేట జిల్లా, మాగ్నూర్‌ మండలంలో గూడేబల్లూరు గ్రామంలో భవాని, దుర్గారాజు దంపతులకు జన్మించారు వరలక్ష్మి. ఆమెకు ఓ తమ్ముడు. దుర్గారాజు తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. స్వగ్రామంలోనే వరలక్ష్మి పదో తరగతి పూర్తి చేశారు. పై చదువులకు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక అక్కడితో చదువు మానేశారు. తర్వాత ముదునూరి శంకర్‌వర్మతో 2009లో ఆమె వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. మొదట్లో శంకర్‌ జిరాక్స్‌ మిషనరీస్‌, సేల్స్‌, సర్వీస్‌ లాంటి వ్యాపారం చేశారు. పెద్దగా లాభాలు రాకపోగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.
వ్యవసాయం చేయాలని…
చిన్నతనం నుండి పల్లెటూరిలో పచ్చని పంటల నడుమ పెరిగిన వరలక్ష్మికి వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది. ఇదే విషయాన్ని భర్తతో పంచుకుంది. అతనికి కూడా వ్యవసాయం అంటే మక్కువ. దాంతో 2013లో శంషాబాద్‌ దగ్గరలో పొప్పడి తోట సాగు ప్రారంభించారు. ఎనిమిది నెలల్లో పంట చేతికొచ్చింది. అందులో లాభాలు బాగానే వచ్చాయి. కానీ పొప్పడి పంట అయిపోయిన తర్వాత ఆ భూముల్లో చాలాకాలం వరకు మళ్ళీ అదే పంట పండించడానికి వీలుండదు. ఎందుకంటే ఆ భూమిలో వైరస్‌ ఎక్కువ. దాంతో కూరగాయల మొక్కలు వేశారు. మూడు నెలలకు పంట చేతికొచ్చింది. కానీ వాటిని మార్కెట్‌కు తరలించడానికి రవాణా చార్జీలు ఎక్కువయ్యాయి. అప్పు చేసి తీసుకెళ్ళినా గిట్టుబాటు ధర లేక చాలా నష్టాలు వచ్చాయి. అందుకే కూరగాయల పంట ఆపేసి ఇంకా ఏదైనా చేయాలని ఆలోచిస్తుండగా అంజీర గుర్తొచ్చింది.
ఏడాది పొడవునా…
అంజీర తోటకు సంబంధించిన వివరాలు సేకరించారు. చెట్టు 30 ఏండ్ల వరకు ఉంటుందని, రెండేండ్లకు ఒకసారి మొక్కను కట్‌ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే 360 రోజులు అంజీర పండ్లు వస్తాయని తెలిసింది. అంజీరలో మొత్తం 660 రకాలు ఉంటాయి. భారతదేశంలో 34 రకాలు పండుతాయి. ముఖ్యంగా మూడు రకాల అంజీరాలలో ఒకటి టర్కీ రకం. రెండవది దయానో, మరొకటి పూనేరకం, దీన్ని బళ్లారి వెరైటీ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో పండుతాయని తెలుసుకొని వరలక్ష్మి బళ్లారి వెళ్లి అక్కడి ఫామ్స్‌ను పరిశీలించి వచ్చారు. నారాయణపేటలో 12 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని బళ్లారి నుండి తెచ్చిన అంజీర మొక్కలు నాటారు.
కలెక్టర్‌ సహకారంతో…
తన జిల్లాలోని ఓ మహిళా రైతు కుటుంబంతో కలిసి అంజీర పండిస్తున్నారని తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచంద్ర ఆమె గురించి ఆరా తీశారు. అది ఆమె జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు ఆమె ‘ఫ్రూట్‌ ఫుల్‌ ప్రోడక్ట్‌’ పేరుతో మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంటుంది. లైసెన్సింగ్‌ ప్యాకేజింగ్‌, మార్కెటింగ్‌లో సహాయపడడానికి వి హాబ్‌ అనే సంస్థ ఉందని ఆమెకు కలెక్టర్‌ ద్వారా తెలిసింది. ఆయనే స్వయంగా హైదరాబాద్‌లోని విహబ్‌ వారితో మాట్లాడి వారి దగ్గరికి పంపించారు వరలక్ష్మిని. 2019లో ఆమె తమ ఉత్పత్తులను కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మాత్రమే విక్రయించేవారు. ఇప్పుడు అవి వి హబ్‌ సహకారంతో క్యూమార్ట్‌ అమెజాన్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మూడు రకాల జాములతో పాటు, అంజీర్‌ పౌడర్‌, చిప్స్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారు.
మొదట్లో అవహేళన చేశారు
వ్యవసాయం చేస్తుందని మొదట్లో కొందరు వరలక్ష్మిని అవహేళన చేశారు. అవేమీ ఆమె పట్టించుకోలేదు. 2020లో వర్మ ఫామ్స్‌ ప్రారంభించారు. అయితే నారాయణపేట నుండి ఉత్పత్తులను హైదరాబాద్‌ తీసుకురావడం ఆర్థిక భారంగా మారింది. దాంతో వి హబ్‌ వారు హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో కొంత స్థలం ఇచ్చారు. దాంతో హైదరాబాదులోనే కొన్ని ఉత్పత్తులు తయారుచేసి ఎగ్జిబిషన్లు పెట్టి లాభాలు పొందుతున్నారు. ఇంకా ఎక్కువ ప్రోడక్ట్‌ తయారు చేయడానికి నారాయణపేట జిల్లాలో సెమీ ఆటోమేటిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నిర్మించాలని వరలక్ష్మి యోచిస్తున్నారు. అంతేకాకుండా మరో రెండేండ్లలో ఫ్రూట్‌ ఫుల్‌ బ్రాండ్‌ ప్రజలందరికీ చేరాలనే లక్ష్యం పెట్టుకున్నారు. పురుషాధిక్యత రాజ్యమేలుతున్న సమాజం మనది. అలాంటి చోట ఒక మధ్యతరగతి మహిళ వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు. ఎన్నో ఆటుపోట్లను, ఆర్థిక ఇబ్బందులను, పోటీ తత్వాన్ని అధిగమిస్తూ, వెలుగుదారులు పరుచుకుంటూ ముందుకు పయనిస్తున్నారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయనిగా నిలిచారు.
పిల్లలు ఇష్టంగా తిన్నారు
2018లో మొక్కలు నాటితే ఆరు నెలల తర్వాత కాపు చేతికొచ్చింది. మొదట్లో 30 నుండి 40 కేజీలు పండేవి. వీటిని మార్కెట్‌కు తీసుకుపోవటానికి ఖర్చు చాలా అయ్యింది. దాంతో పెద్దగా లాభాలు రాక పెట్టిన పెట్టుబడి కూడా చూడకపోయారు. దాంతో మార్కెట్‌కి పోకుండానే అంజీర పండ్లతో ఇంకా ఏమైనా చేయగలమా అనే ఆలోచలో పడ్డారు. ఒకరోజు బాగా పండిన అంజీర పండ్లను తెచ్చి ఇంట్లోనే ఒక స్వీట్‌ తయారు చేశారు. పిల్లలు చాలా ఇష్టంగా తినడంతో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అందివ్వాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటి వరకు వరలక్ష్మికి అంజీర ప్రాముఖ్యం పెద్దగా తెలీదు. ఆమె పిల్లలు కూడా నేరుగా పండును తినడానికి ఇష్టపడలేదు. కానీ ఏడాది తర్వాత నెలకు 50,000 సంపాదించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె పండిస్తున్న అత్తిపండ్లకు మార్కెట్లో ఎంతో డిమాండ్‌ ఉంది. ఈ పండ్లతో జామ్‌లు, ఎండు అంజీర చిప్స్‌, రోల్స్‌తో పాటు ఆకులతో టీ పొడిని కూడా తయారు చేస్తున్నారు.
– డా.తాళ్ళపల్లి యాకమ్మ,
9704226681

Spread the love