వర్సిటీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

– ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయుల జేఎసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్‌ అధ్యాపకులు అనేక సంవత్సరాల నుంచి విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారని తెలిపారు. అలాగే పరిశోధనలు చేశారని.. పేటెంట్లు కూడా కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఉన్నాయని గుర్తు చేశారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు హైలీ క్వాలిఫైడ్స్‌ కాబట్టి వారిని రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌(రిటైర్డ్‌) చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ అధ్యాపకులు అడిగే దాంట్లో న్యాయం ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్‌ను తీర్చాలని కోరారు. ప్రొఫెసర్‌ మల్లేశం మాట్లాడుతూ.. కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు రెగ్యులర్‌ అధ్యాపకులు మద్దతు ఉందని చెప్పారు. న్యాయవాది జీవీఎల్‌ మూర్తి మాట్లాడుతూ.. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌ చట్టం ప్రకారం సాధ్యమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎసీ నాయకులు డాక్టర్‌ ఎం.రామేశ్వరరావు, డాక్టర్‌ శ్రీధర్‌ కుమార్‌లోధ్‌, రేష్మరెడ్డి, దశరథం, రాజేష్‌ ఖన్నా , కరుణాకర్‌ రెడ్డి, మదుశ్ర తదితరులు పాల్గొన్నారు.

Spread the love